Chandrababu medical colleges plan: ఏపీలో మెడికల్ కాలేజీల( medical colleges) వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 4500 కోట్ల రూపాయలతో వీటిని నిర్మాణం చేపట్టాలని భావించింది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రమే మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభం అయింది. మిగతా వాటి దగ్గర పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది. అయితే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) ద్వారా పూర్తి చేయాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను ఈ నెల 9న విడుదల చేసింది. అప్పటినుంచి రాజకీయ రచ్చ ప్రారంభం అయింది. ఇది పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేయడమేనని ఆరోపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే.. ప్రభుత్వం అదుపులోనే మెడికల్ కాలేజీలు ఉంటాయని చెబుతోంది. వేగంగా వాటి నిర్మాణం జరపాలంటే పీపీపీ విధానం మేలు అని సమర్థించు కుంటోంది.
శరవేగంగా నిర్మించాలని..
తాజాగా దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై బలమైన చర్చ కూడా సాగింది. ఈ క్రమంలో తాము ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనే దానిపై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాలని నిర్ణయించడం వాస్తవమేనన్నారు. వాటికి ₹4,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వైసిపి ప్రభుత్వం అంచనా వేసిందని.. కానీ నిర్మాణంలో మాత్రం వెనుకబడిందని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో కేవలం 1500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వాటి నిర్మాణం జరిపించిందన్నారు. అది కూడా ఒక నాలుగు మెడికల్ కాలేజీల పైనే ఈ వ్యయం చేసినట్లు చెప్పుకొచ్చారు. కానీ అవే కాలేజీలకు కూటమి ప్రభుత్వం 750 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాగే ప్రభుత్వపరంగా పెట్టుబడి కొనసాగితే ఈ 17 కాలేజీల నిర్మాణానికి 15 సంవత్సరాలు పడుతుందని సభలో ప్రకటించారు. అందుకే పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వీటిని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని.. కానీ శరవేగంగా నిర్మాణం జరపాలంటే తప్పదు అని తేల్చి చెప్పారు చంద్రబాబు.
ఓ నాలుగు ప్రభుత్వం ఆధీనంలోనే..
అయితే ప్రభుత్వం ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను యధాతధంగా ఉంచాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా అదే విషయాన్ని నిన్న చెప్పారు. ఇప్పటికే ఓ నాలుగు కాలేజీల నిర్మాణం పూర్తయింది. అవి ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తాయి. కానీ ఇంకా నిర్మాణం ప్రారంభం కానీ.. ప్రారంభ దశలో ఉన్న వాటిని మాత్రమే పిపిపి విధానంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీని ద్వారా సామాన్యులకు వైద్య విద్యతో పాటు ఆ మెడికల్ కాలేజీలో వైద్య సేవలు సైతం అందుతాయని చెప్పారు. అయితే ఉచితంగా అందిస్తారా? నిర్ణీత రుసుము వసూలు చేస్తారా? అన్నదానిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే లాభాపేక్ష లేకుండా ఏ కంపెనీ, ఏ సంస్థ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. సాధారణంగా జాతీయ రహదారుల నిర్మాణం ఈ పిపిపి విధానంలోనే నిర్మిస్తుంటారు. తరువాత వాహనదారులనుంచి డోల్ టాక్స్ రూపంలో వసూలు చేస్తుంటారు. పైగా ఈ మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు ఎవరు పెడతారు? ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల అంశంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బాగుంటుంది. వాటి నిర్మాణం శరవేగంగా జరపాలని విధానపరమైన నిర్ణయం తీసుకోవడం మంచిదే అయినా.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడం కూడా అంతే అవసరం.