Telangana Janasena: తెలంగాణలో జనసేన యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేష్టల పుణ్యమా అని. పవన్ కళ్యాణ్ ఆ వివాదం అంతటితో ఫుల్ స్టాప్ అన్నట్టు మాట్లాడారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం యుద్ధం అంటూ సెలవిచ్చారు. తన కోటరీతో రెచ్చిపోయారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టించడం ద్వారా పై చేయి సాధించాలని చూశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసేదాకా వచ్చింది హైదరాబాదులో. పవన్ కళ్యాణ్ పై ఏ ప్రెస్ క్లబ్లో అయితే వ్యక్తిగత దాడి చేశారో.. అదే ప్రెస్ క్లబ్ లో విరుచుకుపడ్డారు తెలంగాణ జనసేన నేతలు. వారు ఇచ్చిన కౌంటర్ తీరు చూస్తుంటే.. ఇదే దూకుడుతో జనసేనను యాక్టివ్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఊపు సాధించుకునే అవకాశం ఉంది.
* వివాదం ముగుస్తుందనగా..
జనసేన ను పక్క రాష్ట్రం రాజకీయ పార్టీగా చిత్రీకరించే క్రమంలో.. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంచెం అతి చేశారు. దాదాపు వివాదం ముగుస్తుందన్న తరుణంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయించారు. ఒకరిద్దరూ పవన్ కళ్యాణ్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు. వివాదాన్ని సద్దుమణిగిస్తారనుకున్న జర్నలిస్టులతో పాటు మేధావులు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడారు. సినిమా వాళ్లు అంటూ చులకన భావంతో చూశారు. వారికి చదువు రాదు అంటూ ఎద్దేవా చేశారు. పనికిరాని వారు మాత్రమే సినిమాల్లో నటిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న.. ఇంతటి వివాదానికి కారణమైన ప్రొఫెసర్ నాగేశ్వర్ పక్కనే ఉన్న వద్దని వారించలేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడంతో ఆయన అభిమానులు బయటకు వచ్చారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
* అంతా సంఘటితం
వాస్తవానికి తెలంగాణలో జనసేన సోషల్ మీడియాకే పరిమితం అవుతూ వచ్చింది. ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన నేతలు, శ్రేణులు సంఘటితం అవుతున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనసేన నేత, నటుడు సాగర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా దాడి చేసిన వారి పేర్లు ప్రస్తావిస్తూ.. ఒక్కొక్కరిపై టార్గెట్ చేస్తూ.. ఒక ప్లాన్ ప్రకారం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ ముసుగులో ఎవరెవరు ఏం చేశారు ఆయన బయట పెట్టేశారు. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల సమయంలోనే జనసైనికులు అగ్గిరాజేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇదే దూకుడుతో జనసేన వ్యవహరిస్తే మాత్రం గ్రేటర్ పరిధిలో రాజకీయాలు సమూలంగా మారడం ఖాయం.
