Pawan Kalyan: ప్రతి రాజకీయ పార్టీకి ఒక అజెండా ఉంటుంది. ప్రత్యేక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహానికి తగ్గట్టు ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తుంటారు. మొన్న పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) తెలంగాణ నేతల వ్యాఖ్యల వెనుక ఒక వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. ముందుగా బిఆర్ఎస్ పార్టీ వారు స్పందించారు. తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా స్పందించి విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శల వెనుక భవిష్యత్తు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమేనని సమాచారం. ముందుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకేనని తెలుస్తోంది.
* గ్రేటర్ ఎన్నికల వ్యూహం..
త్వరలో గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad) ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇవి కాంగ్రెస్ పార్టీకి కీలకం. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచింది ఆ పార్టీ. జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం సానుకూలంగా ఉంది. బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ పుంజుకోలేదు. బిజెపి మాత్రం గట్టిగా సత్తా చాటే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలిపింది జనసేన. గ్రేటర్లో జనసేనకు నాయకులతో పాటు అభిమానులు ఉన్నారు. ఆపై సినీ గ్లామర్ ఉండడంతో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకొచ్చి విమర్శలు చేసినట్లు అర్థమవుతోంది.
* టిడిపి క్యాడర్ అలా.. తెలంగాణలో( Telangana) ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి. ఆ లెక్కన తెలంగాణలో బిజెపికి టిడిపి మద్దతు తెలపాలి. అయితే తెలంగాణ ప్రజల్లో టిడిపి పై ఒక రకమైన వ్యతిరేక భావన ఉంది. అందుకే అక్కడ బిజెపి టిడిపి సహకారం కోరడం లేదు. అలాంటి పరిస్థితుల్లో టిడిపికి బలమైన కేడర్ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో. ఆ క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంది. దానికి కారణం రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కావడంతో టిడిపి క్యాడర్ కాంగ్రెస్ వైపు వెళ్తోంది. అయితే అదే సమయంలో జనసేన కేడర్ కానీ బిజెపి వైపు వెళ్తే ప్రమాదకరమని గుర్తించింది కాంగ్రెస్. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు శ్రుతి మించి విమర్శలు చేసినట్లు అర్థమవుతుంది.