YCP MLCs: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని కూడా తీసుకొని గట్టిగానే పోరాడుతోంది. ఏపీ శాసనసభలో ఆ పార్టీకి సంఖ్యా బలం తక్కువ. కానీ శాసనమండలి వేదికగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా రాజకీయ హింసలో బలైన ఓ వ్యక్తి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనుకున్న కూటమి ప్రభుత్వానికి శాసనమండలిలో చుక్కెదురు అయ్యింది. ఆ బిల్లును శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ క్రమంలోనే కూటమి పునరాలోచనలో పడింది.
* అప్పట్లో మండలి రద్దుకు నిర్ణయం..
2019లో వైసీపీ( YSR Congress party ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి ఎదురయింది. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. కానీ శాసనమండలిలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. ఈ క్రమంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు శాసనమండలిలో ఆమోదానికి నోచుకోలేదు. టిడిపి ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో ఆ పరిస్థితి ఎదురయింది. దీనిని తీవ్ర అవమానంగా భావించారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏకంగా శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఆ నిర్ణయం పెండింగ్లో ఉండిపోయింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి టిడిపి కూటమికి ఎదురు కావడంతో.. ఏం చేయాలన్న ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.
* కూటమికి అనుకూల వ్యాఖ్యలు..
అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏసురత్నం( MLC yesuratnam) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ హింసలో చనిపోయిన వ్యక్తి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన విషయంలో చర్చ ప్రారంభం అయ్యింది. ఆయన పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే బిల్లుకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదిపిందో.. అప్పుడే టిడిపి కూటమి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను ఆకర్షించే ప్రయత్నం చేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏసురత్నం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఏసు రత్నం పోలీస్ శాఖలో పనిచేసేవారు. వడ్డెర కులానికి చెందిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో పోటీ చేశారు. ఓటమి చవి చూడడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆయన మనసు మారినట్లు సమాచారం.
* వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి..
వచ్చే శాసనసభ సమావేశాల( assembly sessions ) నాటికి శాసనమండలిలో టిడిపి కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు పదవీ విరమణ చేశారు. ఇంకొందరు కూటమితో టచ్ లో ఉన్నారు. దీంతో ఓ నలుగురు ఎమ్మెల్సీలను ఇటు వైపు లాక్కుంటే.. తప్పకుండా శాసనమండలి కూటమి చేతిలోకి రావడం ఖాయం. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం వ్యాఖ్యలతో ఒకరు ఖాయమని తెలుస్తోంది. మిగతా ముగ్గురు ఎవరన్నది తేలాల్సి ఉంది.