RK Roja : వైసీపీలో( YSR Congress ) మాజీ మంత్రి రోజాకు పొగ పెడుతున్నారా? నగిరి నియోజకవర్గ తెరపై మరో నేత రానున్నారా? సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో మంత్రిగా ఉన్న రోజా దారుణ పరాజయం చవిచూశారు. 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నగిరి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది. అయితే ఇటువంటి నియోజకవర్గాల విషయంలో సీరియస్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా నేతలు వెనుకబడి ఉంటే వారి స్థానంలో కొత్త వారి నియామకానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో నగిరి నియోజకవర్గం నుంచి ఒక కొత్త నేతను జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* ఎమ్మెల్యేగా భాను
ప్రస్తుతం నగిరి ( nageri )ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన సీనియర్ నేత, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు. తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు భాను ప్రకాష్. రోజా చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. దీంతో చంద్రబాబు 2024 ఎన్నికల్లో సైతం భాను ప్రకాష్ కు టికెట్ ఇచ్చారు. భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు భాను. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు జగదీష్ తో సోదరుడు భానుకు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరడంతో జగదీష్ వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో చర్చలు పూర్తయ్యాయని.. వచ్చే ఎన్నికల్లో నగిరి టిక్కెట్ ఇస్తామంటే పార్టీలో చేరుతానని జగదీష్ షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంగీకరించడంతో జగదీష్ వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* వారసత్వం కోసం పోటీ
2014 ఎన్నికల్లో రోజా చేతిలో ఓడిపోయారు గాలి ముద్దుకృష్ణమనాయుడు( Muddu krishnamma Naidu ). దీంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇంతలో ఆయన అకాల మరణం చెందారు. తండ్రి వారసత్వ రాజకీయాలపై ఇద్దరు పిల్లల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చంద్రబాబు ముద్దు కృష్ణమ భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో సైతం టికెట్ కోసం పట్టుపట్టాడు చిన్న కుమారుడు జగదీష్. కానీ చంద్రబాబు మాత్రం భాను వైపే మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో సైతం తనకే టిక్కెట్ ఇవ్వాలని జగదీష్ మరోసారి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాడు. ఈసారి కూడా భానుకు టికెట్ ఇచ్చారు. అయితే భాను గెలిచిన తర్వాత ఈ విభేదాలు మరింత పెరిగాయి. అందుకే జగదీష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అత్యంత సీనియర్ నాయకుడు
గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలుగుదేశం ( Telugu Desam)పార్టీలో సీనియర్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పుత్తూరు నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. తిరిగి టిడిపిలో చేరి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు సార్లు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి గెలిచిన కృష్ణమ నాయుడుకు నగిరి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆయన వారసత్వం కోసం పిల్లలిద్దరూ గొడవలు పడుతున్నారు. ఇంకోవైపు నగిరిలో రోజా ప్రభావం తగ్గుతోంది. ఈ క్రమంలో గాలి జగదీష్ ను వైసీపీలోకి రప్పించి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే రోజా పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.