TDP Janasena BJP Alliance
TDP Janasena BJP Alliance: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు ప్రచార పర్వం దూకుడుగా కొనసాగుతోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేస్తున్నారు. కూటమి పార్టీలు సైతం ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్తో అధికార పార్టీ ఓట్లలో చీలిక వస్తోందని టిడిపి అంచనా వేస్తోంది. మరోవైపు కూటమిలోని మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని.. క్రాస్ ఓటింగ్ ఉంటుందని వైసిపి భావిస్తోంది. అదే జరిగితే వైసీపీ భారీ విజయం సాధించనుందని అంచనా వేస్తోంది.
కూటమి అభ్యర్థుల నామినేషన్ పర్వానికి టిడిపి, బిజెపి, జనసేన పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. కానీ ఆ మూడు పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఉమ్మడిగా మూడు పార్టీలు ప్రచారం నిర్వహించకపోవడం అందుకు కారణం. శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కేవలం తమ గుర్తుకు ఓటు వేయాలని మాత్రమే ఓటర్లను కోరుతున్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి గుర్తును మాత్రం చెప్పడం లేదు. అలా చెబితే ఓటరు అయోమయానికి గురవుతాడని భావిస్తున్నారు. అయితే ఇది కూటమి పార్టీల మధ్య లుకలుకలకు కారణమవుతోంది. కొత్త ఆందోళనకు దారితీస్తోంది. ఇది ఇలానే కొనసాగితే పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితాల సమయంలో ఎమ్మెల్యేగా ఒక పార్టీ అభ్యర్థి గెలిచి, ఎంపీగా పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే.. క్రాస్ ఓటింగ్ అని నిర్ధారణ అవుతుంది.
ఎన్నికల ప్రచార సభలో మూడు పార్టీల మధ్య సమన్వయం లేదు. కనీసం బిజెపి జెండా పట్టుకునేందుకు కూడా టిడిపి శ్రేణులు అంగీకరించడం లేదు. సభలు, సమావేశాల్లో కేవలం టిడిపి, జనసేన జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కలిపి వందలాది జెండాలు ఉండగా.. ఒకటి రెండు బిజెపి జెండాలు దర్శనమిస్తున్నాయి. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో అయితే బీజేపీ అనే పేరు తలుచుకునేందుకు కూడా టిడిపి ముందుకు రావడం లేదు. కేవలం తాము ఎన్నికల నిర్వహణ కోసమే బిజెపితో కలిశామని… తమకు బిజెపితో ఎటువంటి సంబంధం లేదని స్వయంగా టిడిపి నేతలే ముస్లిం ఓటర్ల దగ్గర మనసు విప్పి చెబుతున్నారు. అటు గుర్తు విషయంలో సైతం కూటమి అభ్యర్థులు స్పష్టంగా చెప్పకపోవడంతో క్రాస్ ఓటింగ్ కు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని సరిదిద్దుకో లేకుంటే మాత్రం కూటమికి ఇబ్బందికర పరిణామమే.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tdp janasena bjp alliance fears cross voting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com