TDP Eyes Pulivendula: పులివెందుల( pulivendula) విషయంలో టిడిపి పక్కా ప్లాన్ వేస్తోందా? ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిందా? పులివెందుల మున్సిపాలిటీ తో పాటు అన్ని మండలాలను కైవసం చేసుకొనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పులివెందుల అంటేనే వైయస్ కుటుంబానికి అడ్డా. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చి కుమారుడికి ఇచ్చి వెళ్లారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. దానిని కాపాడుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. అయితే పులివెందుల కంచుకోటగా మారడానికి కారణం మాత్రం యెడుగురి సందింటి వారి కుటుంబం. ఆ కుటుంబంలో ఐక్యత ఉన్న వరకు ప్రత్యర్థి కూడా తల దూర్చే పరిస్థితి లేదు. కానీ ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. రాజకీయంగా విభేదించుకుంటుంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో పులివెందులలో సైతం ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు టిడిపి ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ పెట్టింది.
అప్పుడే ఫోకస్..
వాస్తవానికి 2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలో వచ్చిన తర్వాత పులివెందులపై ఫోకస్ పెట్టింది. అప్పటికే అక్కడ సతీష్ రెడ్డి అనే ఇన్చార్జి ఉండేవారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఆపై పులివెందుల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే నియోజకవర్గానికి గండికోట ప్రాజెక్టు నీరు ఇవ్వాలని.. అంతవరకు తాను జుట్టు తీయనని అదే సతీష్ రెడ్డి ప్రతినబూనారు. కానీ ఆ బాధ్యతను తీసుకున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. కానీ సతీష్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి తో కుమ్మక్కయ్యారు. ఫలితంగా పులివెందులలో టిడిపి బలం పెరగలేదు. అయితే పులివెందులలో చేయాల్సింది అభివృద్ధి కాదు.. అసలు సిసలు రాజకీయం అని గుర్తించారు చంద్రబాబు. అందుకే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ కుటుంబ సభ్యులను పాచికలుగా చేసుకుని జగన్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
Also Read: Sivakumar YSR Congress EC letter: వైసీపీకి గొడ్డలి గుర్తు కావాలని ఈసీకి లేఖ.. వైరల్
వివేకానంద రెడ్డి హత్యతో..
వివేకానంద రెడ్డి( Vivekanand Reddy ) హత్య అంశం వివాదంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో వైయస్ కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది. అయితే కుటుంబంలో మెజారిటీ శ్రేణులు జగన్ వెంట ఉన్నట్లు అప్పట్లో సంకేతాలు ఇచ్చాయి. ఎందుకంటే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ధీమా ఉండేది. ఈ కారణంగానే వైయస్ కుటుంబ సభ్యులు నోరు మెదిపేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అందుకే ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డికి దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం వైయస్ అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప మిగతా వారంతా దూరం జరిగిపోయినట్టే.
ఎవరీ దుష్యంత్ రెడ్డి?
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వైయస్ కుటుంబం నుంచి ఒక నేత బలంగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో కమలాపురం ఇన్చార్జిగా పనిచేసిన దుష్యంత్ రెడ్డి( Dushyant Reddy).. టిడిపి నీడలోకి వచ్చినట్లు సమాచారం. ఆయన చాలాకాలంగా టిడిపికి అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయనకు సంబంధించిన పనులు కూటమి ప్రభుత్వంలో చకచకా జరిగిపోతున్నాయి. అయితే దుష్యంత్ రెడ్డి తో పాటు గతంలో వైసిపికి పనిచేసిన నేతలంతా టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పులివెందులలో జరిగే మున్సిపల్, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా జగన్ కుటుంబ సభ్యులనే పాచికగా వాడుకునేందుకు టిడిపి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటి ఎన్నికల్లోనే పులివెందులలో రికార్డు స్థాయిలో మెజారిటీ పడిపోయింది. ఇంకోవైపు టిడిపికి బీటెక్ రవి రూపంలో బలమైన నేత దొరికారు. ఇక్కడ టిడిపిలో ఉన్న విభేదాలు సమసి పోయి.. సమన్వయంతో పని చేస్తే.. టిడిపి సైతం వై నాట్ పులివెందుల అనే నినాదం ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇదే నినాదాన్ని వై నాట్ కుప్పం అంటూ ఇచ్చి వైసిపి ఫెయిల్ అయ్యింది. అందుకే టిడిపి పులివెందులలో చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.