Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి. బుధవారం నుంచి అకౌంట్లో జమ అవుతూ వచ్చాయి. మరో రెండు రోజులపాటు ఈ చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అర్హులతో పాటు అనర్హుల జాబితాలను సచివాలయాల వారిగా ప్రదర్శించారు. అయితే పథకానికి అర్హత ఉండి.. సాంకేతిక లోపాల వల్ల పేరు అనర్హుల జాబితాలో ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే సరైన ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసిన వారికి రెండో విడత కింద నిధులు జమవుతాయి. దీనిపై ఎప్పటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది
* మరోసారి పత్రాలు ఇలా..
300 యూనిట్ల విద్యుత్ వాడకానికి సంబంధించి సమస్యగా చూపితే మీటర్ డి సీడింగ్ రసీదు అందజేయాల్సి ఉంటుంది. నాలుగు చక్రాల వాహనానికి సంబంధించిన సమస్య ఉంటే సంబంధిత వాహన ఆర్సీ కాపీ తీసుకెళ్లాలి. ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన సమస్య అయితే చార్టెర్డ్ అకౌంటెంట్ ద్వారా తీసుకున్న సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. పొలం లేదా భూ సమస్య అయితే పొలానికి సంబంధించి వన్ బి / అడంగల్ రికార్డులు తీసుకెళ్లాలి. ఒకవేళ పొరపాటున cfms ఐడి పడితే సంబంధిత మినహాయింపు ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేరు, ఇతర సమాచారం తప్పుగా ఉంటే.. తల్లితో పాటు విద్యార్థి సరైన ఆధార్ కార్డులు ఉండాలి. ఆయా సమస్యలకు సంబంధించి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్ తీసుకెళ్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ ను కలిస్తే.. ఆ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి గ్రీవెన్స్ లో నమోదు చేస్తారు. అధికారుల పరిశీలనలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే తిరిగి అర్హుల జాబితాలో పేరు చేర్చుతారు.
* అంతమంది పిల్లలకు..
తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు సాయం అందజేశారు. అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు నిధులు జమ చేశారు. ఒకటో తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న నిధులు జమ చేస్తారు. ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయడం విశేషం. అయితే వివిధ కారణాలతో సాయం దక్కని వారు గ్రీవెన్స్ సెల్లో మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

