Homeఆంధ్రప్రదేశ్‌AP Capital Issue : అమరావతి కేసుల విచారణలో ట్విస్ట్..

AP Capital Issue : అమరావతి కేసుల విచారణలో ట్విస్ట్..

AP Capital Issue : అమరావతి రాజధానుల కేసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 9న విచారించాలని సుప్రీం కోర్టు డిసైడ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జూలైకు వాయిదా పడిన విచారణ … ఇప్పుడు మరోసారి అత్యవసరంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. త్వరితగతిన కేసును తేల్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు అత్యవసర విచారణ చేపడుతున్నారని అంతా భావించారు. కానీ అది రైతుల విన్నపం మేరకు విచారణ చేపడుతుండడం విశేషం. ఈ కేసుకు సంబంధించి చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్‌ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు.  అందు కోసమే ఈ అత్యవసర విచారణగా తేలింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ..
అమరావతే ఏకైక రాజధాని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతిని అన్ని మౌలిక వసతులతో రాజధానిగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కారుకు ఆదేశాలిచ్చింది. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు గత ఏడాది మార్చి 3న తీర్పు చెప్పించింది. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు సవాల్ చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ముఖ్యంగా  హైకోర్టు తీర్పులోని రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర శాసనసభ అధికారాలపై కోర్టు నిర్ణయం తీసుకోలేనందున ఏపీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

ఏడాదిగా విచారణ..
గత ఏడాదిగా సుప్రీం కోర్టులో విచారణ పర్వం కొనసాగుతోంది. ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. అటు ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సర్కారులో ఆందోళన ప్రారంభమైంది. కోర్టు కేసులు అధిగమించలేక… మూడు రాజధానుల అంశంపై ముందడుగు వేయలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా కేసుల విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరుతూ వస్తున్నారు. కానీ వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని  సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది. దీంతో జగన్ సర్కారు సైతం పునరాలోచనలో పడింది. మూడు రాజధానుల విషయంలో జూలై వరకూ వేచి ఉండేందుకు డిసైడ్ అయ్యింది. సీఎం జగన్ సెప్టెంబరు నుంచి విశాఖలో కాపురం పెడతానని ప్రకటించడం అందులో భాగమే.

రైతుల విన్నపంతోనే..
కానీ రైతుల విన్నపం మేరకు ఈ నెల 9న అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం సమ్మతించింది. పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతుల్లో కొందరు చనిపోయారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును రైతు తరుపు న్యాయవాదులు కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం పంపకపోవడంతో రైతుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. దీనిపైనే విచారణ చేయనున్నారు. కానీ జూలై 11 విచారణ విషయంలో ఎలాంటి మార్పు లేదన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version