Sunkara Padmashree replaces Sharmila: ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు మార్చే ఆలోచనలో హై కమాండ్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ టాక్ నడుస్తూనే ఉంది. పిసిసి చీఫ్ గా షర్మిల( Sharmila) ఉన్నారు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఆమె బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న ఆమె.. అక్కడ అంతగా రాణించలేకపోయారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీ తరపున తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ప్రత్యామ్నాయంగా ఏపీ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఆమె బాధ్యతలు తీసుకొని మూడేళ్లు అవుతోంది. కానీ ఏపీలో కాంగ్రెస్ మాత్రం బలపడడం లేదు. ఈ తరుణంలో షర్మిలను మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ అధ్యక్ష పదవిపై కన్నేశారు. షర్మిల కంటే ముందే పదవి ఆశించి చాలా రకాలుగా సేవలు అందించారు. అనుకోని రీతిలో షర్మిల వచ్చేసరికి సైలెంట్ కావాల్సి వచ్చింది పద్మశ్రీ.
బలపడని కాంగ్రెస్..
ఏపీలో కాంగ్రెస్( Congress Party ) బలపడడం లేదు. షర్మిల రాకతో పరిస్థితి మారుతుందని హైకమాండ్ ఆశించింది. కానీ ఎక్కువగా షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఈ విషయంలో హై కమాండ్ ప్రోత్సాహం ఉన్నట్లు కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న సమయంలోనే వైసీపీని ఏర్పాటు చేశారు.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ ను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని అదే స్థాయిలో దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ హై కమాండ్ భావించింది. అందుకు తగ్గట్టుగానే షర్మిల తనకున్న వైరాన్ని జగన్మోహన్ రెడ్డి పై ప్రయోగించారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో రాజకీయంగా సక్సెస్ అయిన కాంగ్రెస్.. ఏపీలో బలోపేతం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబాటు కనిపిస్తోంది.
సీనియర్ల ఫిర్యాదులు..
షర్మిల తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో కూడా ఆగ్రహం ఉంది. ఆమెపై హై కమాండ్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆమెను మార్చుతారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇటీవల మార్పు ఖాయమని టాక్ నడుస్తోంది. అయితే ఈ పదవిని కోరుకుంటున్న సుంకర పద్మశ్రీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. షర్మిలను మార్చి తనకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఇంకా ఉండనే ఉన్నారు. పైగా ఒక్క ఏపీలోనే కాదు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది. అందుకే షర్మిలను మార్చే సాహసం చేస్తారా? ఆమె స్థానంలో పద్మశ్రీ లాంటి వారికి ఛాన్స్ ఇస్తారా? అనేది అనుమానమే..