AP BJP: ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టిడిపి అనుసరించిన వైఖరితో బిజెపి చేరికలో ఆలస్యం అవుతోంది. బిజెపి వస్తుందో? రాదో? అన్న పరిస్థితి నెలకొంది.దీంతో కూటమి పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. తుది రూపం రాలేదు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు బిజెపి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. గత నాలుగు సంవత్సరాలుగా బిజెపి ప్రాపకం కోసం పడిగాపులు పడిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది నెలల కిందట ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఒకటి రెండు సార్లు భేటీ తరువాత పొత్తు ప్రకటన ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఇంతలోనే సీన్ మారింది. చంద్రబాబు అరెస్టు జరిగింది. జగన్ నిర్ణయం వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారు అన్న అనుమానం మొదలైంది. అదే టిడిపి శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది.
తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ గత అనుభవాల దృష్ట్యా పొత్తుకు బిజెపి ఒప్పుకోలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకుంది. అటు చంద్రబాబు సైతం ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తగినట్టుగానే కాంగ్రెస్ ప్రచారంలో టిడిపి జెండాలు కనిపించాయి. కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో సైతం టిడిపి శ్రేణులు సందడి చేశాయి. కానీ వాటిని చంద్రబాబు నియంత్రించిన దాఖలాలు లేవు. ఇప్పుడు బిజెపి ఆగ్రహానికి ఇదో కారణంగా నిలుస్తోంది. తెలంగాణలో తమను ఓడించిన పార్టీతో ఎలా కలుస్తామని బిజెపి ప్రశ్నిస్తోంది.
అయితే తాము ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదని చంద్రబాబు చెబుతున్నారు. తాము పోటీ నుంచి తప్పుకున్నామని.. పార్టీ శ్రేణులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేశారని చెప్పుకొస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఆప్షన్ లేదని.. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఛీ కొడతారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. బిజెపి తమతో కలిసి రాకుంటే కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయని ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర సహకారం అవసరం కావడంతో బిజెపితో స్నేహం చంద్రబాబుకు అనివార్యంగా మారింది. అందుకే వీలున్నంతవరకు బిజెపికి కన్వెన్స్ చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.