CM Chandrababu: ఏపీలో ఓ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. సీఎం చంద్రబాబుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించడం ఈ వార్త సారాంశం. బాపట్లలో టిడిపి కార్యాలయ స్థలం కబ్జా అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2000 సంవత్సరంలో పార్టీ కార్యాలయానికి 9.50 సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు టిడిపి కార్యకర్త మొవ్వ సుబ్బారావు. అందులో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అప్పట్లో. అయితే అదే స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం వెలుగులోకి వచ్చింది. ఏపీవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
* స్థలం ఖాళీగా ఉండడంతో
బాపట్ల లోని శ్రీనివాస నగర్ సర్వేనెంబర్ 969/1లో 9.50 సెంట్లు స్థలం ఉండేది. అదే స్థలాన్ని టిడిపి కార్యాలయం కోసం ఇచ్చారు సుబ్బారావు. అయితే అప్పట్లో టిడిపి అధికారంలో లేకపోవడంతో కార్యాలయ నిర్మాణం కోసం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుల కన్ను ఆ భూమిపై పడింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని, నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ వ్యవహారం 2010లోనే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ భూమి రిజిస్ట్రేషన్ తో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ఉన్న వ్యక్తుల వ్యవహారం బయటపడింది.
* సూత్రధారి సత్తార్ రెడ్డి
అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక నక్క సత్తార్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సూత్రధారి ఆయనేనని సమాచారం. బాపట్ల మండలం కొత్త వాడరేవుకు చెందిన సత్తార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈయనపై గతంలో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు, కేసులు నడుస్తున్నాయి. అయితే ఏకంగా ఓ పార్టీ కార్యాలయం స్థలాన్ని కబ్జా చేశారంటే.. వీరు ఎంతకు తెగించారో అర్థం అవుతోంది. ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆరా తీసినట్లు సమాచారం.
* అన్ని జిల్లాల్లో సొంత కార్యాలయాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నది తెలుగుదేశం ప్రణాళిక. ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చాలా వరకు కార్యాలయాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఇంకా కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. అందుకే కార్యాలయ నిర్మాణానికి హై కమాండ్ నిర్ణయించింది. దాదాపు ఏడాదిలో కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.