Srikakulam Kantara Kali Mata temple: ఏ ప్రాంతంలోనైనా గ్రామ దేవతలు ప్రత్యేకం. అష్టదిక్పాలకులుగా.. గ్రామాన్ని సుభిక్షంగా, శుభప్రదంగా ఉంచేది గ్రామ దేవతలు. అందుకే గ్రామ దేవతలను నిత్యం పూజలు చేస్తుంటారు ప్రజలు. చల్లదనంతో గ్రామ దేవత కరుణాకటాక్షాలు ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. గ్రామ దేవత వేడుకలు జరుపుతుంటారు. అయితే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మాత్రం ఈ గ్రామ దేవత పండుగలు ప్రత్యేకం. ముఖ్యంగా అక్కడ కాళీమాత నృత్యం ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారి పండుగ జరుగుతుంది అంటే కచ్చితంగా కాళికామాత డాన్స్ ఉండాల్సిందే.. అంతలా పెనవేసుకుపోయింది ఆ నృత్యం. కాంతారా సినిమా మాదిరిగా.. ప్రత్యేక వేషధారణలో కాళికామాత ఉద్దానం పండుగలు కీలక పాత్ర పోషిస్తుంది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.
జానపద కళారూపం..
కాళికమ్మ నృత్యం అనేది భక్తి, ఉగ్రరూపం ప్రదర్శించే ఒక అద్భుతమైన జానపద కళారూపం. అమ్మవారి పండుగలతో పాటు ఉత్సవాల్లో కాళికామాత నృత్యం ఉండాల్సిందే. చివరకు ఇంటి పండుగలో సైతం ఈ నృత్య కళారూపం లేనిదే సందడి ఉండదు. కలకత్తా కాళీ మాత మాదిరిగా ప్రత్యేక వేషధారణతో అమ్మవారి నృత్యం చేస్తున్నట్టు మాదిరిగా కళాకారులు తమ అభినయాన్ని చాటుతుంటారు. కళ్లకు కాటుక, తలపై కిరీటం, మెడలో కపాల హారాలతో ఉగ్రరూపంతో నర్తిస్తుంటారు కళాకారులు.
అచ్చం కాంతరాగా..
ఉద్దానంలో కాళీమాత వేషధారణలు చూస్తే.. కాంతారా సినిమా మాదిరిగా ఉంటుంది ఉగ్రరూపం. అయితే ఈ వేషధారణతో కనిపించే కళాకారులు ప్రత్యేక నిష్ఠలు అవసరం. బయటకు చూపించే రక్తపు నాలికతో అచ్చం అమ్మవారిని తలపిస్తారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డాన్సులు చేస్తుంటారు. ఈ ప్రాంత ప్రజల నమ్మకాలు, దైవ రహస్యాలను చాటిచెబుతాయి కాళికామాత నృత్యాలు. చెడును అణచి.. మంచిని కాపాడే శక్తిగా చూపిస్తారు. ప్రస్తుతం ఉద్దానం వ్యాప్తంగా అమ్మవారి పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో కాళికామాత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
