Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. గత ఆరు సంవత్సరాలుగా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదు. బెయిల్ పై బయట ఉన్నారు. ఆపై సీఎంగా ఎన్నిక కావడంతో కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపులు లభించాయి. అయితే ఈసారి అలా కాదు. తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని కోర్టు చెప్పడంతో షాక్ తిన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇకనుంచి వరుసగా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయింది. ఇంకా ఉన్నది 43 నెలలు మాత్రమే. అయితే ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలను మొదలుపెట్టనున్నారు. అయితే ఇంతలోనే కోర్టు కేసులు ఎదురు కావడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళన పరుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుస కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది.
* మూడు పార్టీల మధ్య పటిష్ట బంధం..
ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం. మధ్యలో జనసేన సైతం బలమైన మిత్రపక్షంగా ఉంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో కూటమి విచ్ఛిన్నం అసాధ్యం. మునుపటి మాదిరిలా బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాన్స్ ఇవ్వదు. చంద్రబాబు సైతం వైసీపీ ట్రాప్ లో పడే అవకాశం లేదు. ఇన్ని పరిణామాల నడుమ జగన్మోహన్ రెడ్డిని ఎలా నియంత్రించాలో కేంద్రానికి తెలుసు. ఇప్పటికే దీనిపై చర్చించి ఉంటారు కూడా. ఎందుకంటే 2029 ఎన్నికలను కూడా ఎన్డీఏ టార్గెట్ చేసుకుంది. రాష్ట్రాల వారీగా వారికి ఒక టార్గెట్ ఉంది. అందులో భాగంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయవలసిన అనివార్య పరిస్థితి కేంద్రానికి ఎదురైంది.
* కోర్టుకు హాజరు కావాల్సిందే..
ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు కావడంతో సిబిఐ కోర్టు ( CBI Court)అనుమతి తప్పనిసరిగా మారింది. అయితే సిబిఐ కోర్టు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. కానీ విదేశాల నుంచి వచ్చిన వెంటనే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే విదేశాల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. తాను కోర్టుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పాట్లు దృష్ట్యా భారం పడుతుందని.. అందుకే తన తరుపున న్యాయవాది వస్తారని.. అవసరం అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారణ జరపవచ్చని పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు కోర్టు నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టుకు హాజరైతే వారం వారం విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారు.
* తెరపైకి పాత కేసులు..
జగన్మోహన్ రెడ్డి ఒక్క అక్రమాస్తుల కేసుల్లోనే కాదు.. చాలా రకాల కేసులు వెంటాడుతున్నాయి. కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి కూడా ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఎప్పుడూ ఆయన హాజరు కాలేదు. తనను హత్య చేసేందుకు అప్పట్లో దాడి జరిగిందని హంగామా చేసిన జగన్.. ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగానే ఏళ్ల తరబడి ఉండిపోయారు. ఆ కేసులో సైతం బాధితుడిగా కోర్టుకు హాజరు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసారు. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం లో సైతం జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అని ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా వెంటాడుతోంది వైసీపీ నేతలకు. అయితే తాజాగా కోర్టుల ఆదేశాలు చూస్తుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. విరుగుడు చర్యలుగా పాత కేసులు తెరపైకి వస్తుండడం గమనార్హం.