https://oktelugu.com/

Chandrababu: విశాఖ శారదా పీఠానికి షాక్.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో గత ఐదేళ్లపాటు ఓ స్వామీజీ హవా నడిచింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత సీన్ మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 19, 2024 / 01:49 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి జగన్ వచ్చేవారు. అటు రాష్ట్ర ప్రభుత్వపరంగా ధార్మిక విషయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. స్వరూపానంద స్వామీజీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతలా జగన్ తో స్వామీజీ అనుబంధం పెనవేసుకుపోయింది. అయితే అదే చదువుతో విశాఖలో వైదిక యూనివర్సిటీ కోసం భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు స్వామి స్వరూపానంద. దీంతో 250 కోట్ల విలువ చేసే భూమిని.. 15 లక్షల రూపాయలకే అందించింది వైసీపీ సర్కార్. వైదిక యూనివర్సిటీ కోసం అని చెప్పిన ఆ భూమిని.. వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకుంటామని శారదాపీఠం దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితేఇప్పుడు అదే భూమి కేటాయింపు అనుమతులను రద్దు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడం విశేషం.

    * ఫలితాల తర్వాత చంద్రబాబుపై ప్రశంసలు
    ఏపీలో ఫలితాలు వచ్చిన తర్వాత స్వామి స్వరూపానంద మాట్లాడారు. తనకు చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనా దక్షుడని కూడా కొనియాడారు. గతంలో రాజమండ్రిలో ఆయన కోసం యాగం చేసినట్లు కూడా గుర్తు చేశారు. అయితే ఇదంతా విశాఖలో కేటాయించిన భూమికేనని ప్రచారం సాగింది. గత నాలుగు నెలలుగా ఈ భూమిపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. రకరకాల కామెంట్స్ వినిపించాయి. కూటమి ప్రభుత్వంలో సైతం స్వామీజీ లాబీయింగ్ పనిచేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఏకంగా చంద్రబాబు సర్కార్ స్వామీజీ కి షాక్ ఇచ్చింది. ఆ భూముల అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    * హైదరాబాదులో మకాం
    అయితే ఈ విషయాన్ని స్వామీజీ ముందుగానే గ్రహించినట్టు ఉన్నారు. ఏటా నాగుల చవితి నాడు స్వామి వారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నాగుల చవితి ఇక్కడే జరుపుకుని.. స్వామీజీ హైదరాబాద్ మకాం మారుస్తారని ప్రచారం సాగుతోంది. అక్కడ తెలంగాణలో శారద పీఠానికి కేసీఆర్ సర్కార్ 4 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఈ భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని శారదాపీఠం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే 250 కోట్ల విలువ చేసే భూమి తిరిగి ప్రభుత్వానికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.