YS Sharmila Rajya Sabha: వైయస్ షర్మిల( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె ఏపీ బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు పగ్గాలు ఇవ్వడం ద్వారా పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లవచ్చు అని అంచనా వేశారు. కానీ ఆమె ఎంత మాత్రం ప్రభావం చూపలేదు. అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం అధికారం నుంచి దూరం చేయడంలో షర్మిల కీలక పాత్ర పోషించారు. అయితే ఆ విషయంలో సక్సెస్ అయిన ఆమె రాజకీయంగా మాత్రం మెరుగు పడలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ హై కమాండ్ ఆమెకు ఇచ్చిన హామీ విషయంలో న్యాయం చేయలేదు. ఇప్పుడు రాజ్యసభ పదవుల ఎంపికలో న్యాయం జరుగుతుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అయితే తనకు రాజ్యసభ పదవీ విషయంలో కొన్ని అడ్డంకులు ఉన్నావన్న విషయం ఆమె దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
జూన్లో భర్తీ..
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్లో 70 వరకు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. అందుకే ఎన్నికల నిర్వహణకు ఈసీ( Election Commission) అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో షర్మిల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిబంధనలు మార్చడాన్ని నిరసిస్తూ ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లా బండ్లపల్లి లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్. అయితే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మార్చింది. ఉపాధి హామీ చట్టాన్ని, నిబంధనలను సైతం సవరించింది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి నుంచి భారీ ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు షర్మిల ఢిల్లీ వెళ్ళినట్లు ప్రచారం నడుస్తోంది. కానీ షర్మిల మాత్రం రాజ్యసభ పదవి అడిగేందుకేనని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అప్పట్లోనే హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో( Telangana) రాజకీయ పార్టీని స్థాపించారు షర్మిల. ఆ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర కూడా చేశారు. కానీ పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ ఛాన్స్ దక్కలేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే రాజ్యసభ పదవిని ఎక్కడినుంచో సర్దుబాటు చేస్తామని హైకమాండ్ అప్పట్లో హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు కర్ణాటకలో అధికారంలో ఉంది. ఓ ఐదు నుంచి ఏడు రాజ్యసభ పదవులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ కోట కింద షర్మిలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అక్కడి నుంచి ప్రమోట్ చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. పోనీ కర్ణాటక నుంచి షర్మిలకు పదవి ఇస్తామంటే అదృశ్య శక్తి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే షర్మిల నిన్న ఏపీకి వచ్చి ఆ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డికి మంచి రిలేషన్ ఉంది. అందుకే ఆయన తరచూ బెంగళూరు వెళ్ళిపోతున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఆయనే షర్మిలకు రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకుంటున్నట్లు ఒక ప్రచారం అయితే ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.