Amaravati Farmers: అమరావతి ( Amravati capital ) రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతులకు లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. వీధి పోట్లు ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపించేలా ఈ కొత్త నిర్ణయం ఉంది. రాజధానికి రైతుల నుంచి భారీగా భూములు సమీకరించిన సంగతి తెలిసిందే. కానీ అమరావతి రైతులకు సంబంధించి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకు వీధి పోట్లు సమస్యలు ఉన్న ప్లాట్లకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించింది. ఉత్తర్వులు కూడా జారీచేసింది.
* వీధి పోట్లు అధికం..
సాధారణంగా వీధి పోట్లు అనేది సెంటిమెంట్ తో కూడుకున్న అంశం. అటువంటి స్థలాలకు ధర ఉండదు. నివాసయోగ్యం కాదు అనేది ఒక అభిప్రాయం. అదే విషయాన్ని అమరావతి రైతులు త్రిసభ్య కమిటీ( three men committee ) ముందు ఉంచారు. దీంతో వీధి పోట్లు ఉన్న ప్లాట్ల బదులు వేరేచోట సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయని, మ్యుటేషన్ కానీ 112 ఫ్లాట్లను అధికారులు గుర్తించారు. అందుకే ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఈ ప్లాట్ లకు బదులు వేరేచోట వాస్తు ప్రకారం ప్లాట్లు కేటాయించనున్నట్లు సిఆర్డిఏ ప్రకటన చేసింది. ప్రధానంగా ఉండవల్లి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు 21 రిటర్నబుల్ ప్లాట్ లను కేటాయించారు. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
* చురుగ్గా గ్రామసభలు..
ప్రస్తుతం అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం గ్రామసభలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉద్దండరాయుని పాలెం , వెలగపూడి, వెంకట పాలెం లో గ్రామసభలు జరుగుతున్నాయి. ఉండవల్లి గ్రామానికి చెందిన 195 మంది రైతులకు సి ఆర్ డి ఏ అధికారులు 381 నివాస, వాణిజ్య ప్లాట్ లను కేటాయించారు. ఈ లాటరీ విధానంలో కేటాయింపులు చేశారు. పూర్తి ఆన్లైన్ రాండం పద్ధతిలో ట్రయల్ రన్ వేశారు. ప్రత్యక్షంగా లాటరీ ప్రక్రియను చేపట్టారు.