MLA Adhimulam Wife : ఆదిమూలంపై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య గోవిందమ్మ తప్పుపట్టారు..” నా భర్త నిరపరాధి. ఇటువంటి తప్పు చేయలేదు. ఆయన రాజకీయంగా ఎదుగుతున్నారు. ఆయనను ఓడించలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నా భర్తకు నలుగురు పిల్లలు. ఈ వయసులో ఆయన అలాంటి పని ఎందుకు చేస్తాడు. ఆయన బాధ్యత ఉన్న ఒక తండ్రిగా బిడ్డల పెళ్లిళ్లు చేశారు. ఆయన ఇంతవరకు ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి కూడా లంచం తీసుకోలేదు. నియోజకవర్గంలో ఆయన ఎలాంటి వారో ప్రతి ఒక్కరూ చెబుతారు. ఆయనకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మంచి చేసే సేవ భావం ఆయనకు మొదటి నుంచి ఉంది. ఆయన రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగి ఇక్కడ దాకా వచ్చారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు తెర లేపారు. ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది నాయకులు మోసాలకు పాల్పడ్డారు. ఎవరు ఎలాంటి దారుణాలకు పాల్పడినప్పటికీ.. నా భర్త పులు కడిగిన ముత్యం లాగా.. తన నిజాయితీని నిరూపించుకుంటారని” ఆమె పేర్కొన్నారు.
రెండోసారి ఎమ్మెల్యే గా గెలవడంతోనే..
సత్యవేడు ఎమ్మెల్యేగా ఆదిమూలం రెండోసారి గెలవడంతోనే.. కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అందువల్లే తెర వెనుక చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.. ప్రస్తుతం ఆదిమూలం ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని… చికిత్స కోసం గురువారం రాత్రి చెన్నై వెళ్లారని.. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆదిమూలం కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలు.. వాయిస్ రికార్డింగ్ లన్నీ ఫేక్ అని కొట్టి పారేశారు..”ఓటు వేయని వారు కూడా పదవుల కోసం పాకులాడుతున్నారు. కుట్రలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేగా ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు.. ఇలాంటి కుట్రలు ఎల్లకాలం సాగవు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఆదిమూలం నిర్దోషి లాగా బయటికి వస్తారు. ఆయనను ఇబ్బంది పెడుతున్న వారంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారే. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో చెరువుల్లో కప్పల లాగా వస్తున్నారు. వారంతా పదవుల కోసం పాకులాడుతున్నవారు. గత ఎన్నికల్లో ఆదిమూలం గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ప్రజల్లో ఆయనకు బలం లేకపోతే ఎలా గెలుస్తారు. ఈ విషయం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. కానీ ఆరోపణలు కావడమే ఆలస్యం.. నిజ నిజాలు తెలుసుకోకుండా వేటు వేశారు. ఆయన ఆదిమూలం తన నిజాయితీని నిరూపించుకుంటారని” ఆదిమూలం కొడుకు సుమన్, భార్య గోవిందమ్మ, అల్లుడు జాన్ కెనడీ పేర్కొన్నారు.
కాగా, కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియడంతో టిడిపి అధిష్టానం ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఆదిమూలం 2014లో సత్యవేడు నియోజకవర్గం లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 లో టిడిపిలో చేరారు.. సత్యవేడు నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.