https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి పై శ్రద్ధగా బురద చల్లించిన వైసీపీ

ఇటీవల జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది చిరంజీవి తనంతట తాను ఇవ్వలేదని.. పవన్ ఒత్తిడి చేశారని సాక్షి మీడియా చెబుతుండడం విశేషం.

Written By: , Updated On : April 25, 2024 / 02:45 PM IST
Chiranjeevi

Chiranjeevi

Follow us on

Chiranjeevi: చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. తిరిగి సినిమా రంగం వైపు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా కూడా మారారు. తన పనేదో తాను చేసుకుంటున్నారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా, సోదరుడిగా రాజకీయాల్లో ఉన్న తన తమ్ముడిని ఆశీర్వదించారు. ఆ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఒక అన్నగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా తన వారి హితం కోరుకోవడం సర్వసాధారణం. కానీ వైసీపీకి అది ఇబ్బందికరంగా మారింది. అందుకే ముందస్తు ప్లాన్ అన్నట్టు చిరంజీవిపై విరుచుకుపడింది.

ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సింహం సింగిల్ అంటూ జగన్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన ఎదుట చిరంజీవి ఒక లెక్క అన్నట్టు మాట్లాడారు. అటు తర్వాత పోసాని కృష్ణ మురళి వచ్చారు. ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. అయితే ఎక్కడో తేడా కొట్టడంతో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవిని తాము విమర్శించలేదని.. ఆయన రాజకీయాల్లోకి వస్తే తమకు అభ్యంతరం లేదని పొడిపొడిగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యాఖ్యలతో వైసిపి కి డ్యామేజ్ తప్పదని భావించినట్టు ఉన్నారు. అందుకే సైడ్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవిపై సాక్షి మీడియాను వదిలారు. బురద చల్లడం ప్రారంభించారు.

ఇటీవల జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది చిరంజీవి తనంతట తాను ఇవ్వలేదని.. పవన్ ఒత్తిడి చేశారని సాక్షి మీడియా చెబుతుండడం విశేషం. తన వద్దకు వచ్చిన చిరంజీవితో పాటు సినీ ప్రముఖులను జగన్ ఎంతో అభిమానించారని, గౌరవభావంతో చూసుకున్నారని సాక్షి చెప్పుకొచ్చింది. చంద్రబాబుతో పాటు పవన్ లే చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడాలని తేల్చేసింది. అయితే సీఎంతో సినీ ప్రముఖుల చర్చలను రహస్య కెమెరాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయాన్ని మాత్రం సాక్షి ప్రస్తావించలేదు.

చిరంజీవి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని.. అవినీతిపరులను సమర్ధించడం ఏమిటని సాక్షి ప్రశ్నించడం విశేషం. చిరంజీవి తెలివైనవాడు అనుకున్నామని.. కానీ ఆయన సైతం పవన్ సరసన చేరారని చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చినందుకే బిజెపితో ఉన్న కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించారని అసలు విషయాన్ని బయట పెట్టింది. అవినీతిపరుడైన సీఎం రమేష్ ను పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగడాన్ని కూడా తప్పు పట్టింది.

అయితే చిరంజీవికి ఉన్న ప్రేక్షకాదరణకు పద్మ విభుషణ్ లభించడం ఏమంత పెద్ద లెక్క కాదు. అంతకుమించి అవార్డులకు చిరంజీవి అర్హుడు అన్న విషయాన్ని సాక్షి మరిచిపోయింది. సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ ను చిరంజీవి కలిసినప్పుడు సాక్షికి ఆయన ఉత్తముడుగా కనిపించాడు. కానీ కూటమికి మద్దతు తెలిపిన పాపానికి అదే చిరంజీవి కాని వాడు అయ్యాడు. అందుకే ఒక పద్ధతి ప్రకారం బురద చల్లడానికి ప్రయత్నించడం గమనార్హం.