YCP – Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు సలహాదారుడు. అన్నింటికీ మించి ఒక వ్యూహకర్త. జగన్ కు అత్యంత ఆప్తుడు. కానీ ఇప్పటివరకు సుఖాల్లోనే కనిపించిన ఆయన.. వైసీపీకి కష్టాలు ఎదురైనప్పుడు కనిపించకుండా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ తర్వాత ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఏకంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కౌంటింగ్ తర్వాత కనిపించకుండాపోయారు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. సోషల్ మీడియా వింగ్ ను చూసే ఆయన కుమారుడు భార్గవరెడ్డి సైతం అదృశ్యమయ్యారు.తండ్రీ కొడుకులు ఎటైనా పారిపోయారా అన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు ఆయనే చూసేవారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించేవారు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలన్నా.. సొంత పార్టీలో సమస్యలు వచ్చినా.. అంతెందుకు వైయస్ షర్మిల పై మాట్లాడాలన్నా సజ్జల వారే ఉండేవారు. జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయాలన్నా.. విపక్ష నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాల్సిందే. ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారే కాదు.. సకల శాఖామంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ అధికారంలోఉన్నప్పుడు అందరూ కనిపిస్తారు. పోయినప్పుడు మాత్రం ఎవరూ కనిపించరు. ఆ జాబితాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేరిపోయారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నట్లు నాయకత్వం ఆందోళన చెందుతుంది. అందుకే గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని మాత్రమే వెళ్లి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సొంత పార్టీ శ్రేణుల సైతం సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పటికే పార్టీని భ్రష్టు పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు సీఎం ఓ కార్యాలయ అధికారి ధనుంజయ రెడ్డి పై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మరి ఇంతటి ఘోర పరాజయం తర్వాత వారు కనబడకపోవడంపై కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సజ్జల విషయంలో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ శ్రేణుల సైతం ఆరా తీస్తున్నారు.