https://oktelugu.com/

RK Kotha Paluku: ఆర్కే కొత్తపలుకు: ఆఫ్ట్రాల్ 371 కోట్లు.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ని కూడా అరెస్టు చేస్తారేమో?

చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి రాధాకృష్ణ ఇలానే రాస్తున్నాడు. దేశంలో ఇంకా ఏ సమస్యలూ లేనట్టు, చంద్రబాబు అరెస్టు వల్ల దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయినట్టు రాస్తున్నాడు.

Written By:
  • Rocky
  • , Updated On : October 1, 2023 / 08:17 AM IST

    RK Kotha Paluku

    Follow us on

    RK Kotha Paluku: ” కేవలం 371 కోట్ల కేసులో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేస్తారా? అలాగైతే 43,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డిని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి? పది సంవత్సరాల నుంచి బెయిల్ పై ఉంటున్న అతడిని మన వ్యవస్థలు ఏమీ చేయలేవా” ఇవీ ఈరోజు కొత్తపల్కలో ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ పెట్టిన శోకాలు.

    చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి రాధాకృష్ణ ఇలానే రాస్తున్నాడు. దేశంలో ఇంకా ఏ సమస్యలూ లేనట్టు, చంద్రబాబు అరెస్టు వల్ల దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయినట్టు రాస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు ఏ తప్పూ చేయకుంటే బెయిల్ వస్తుంది. కేసుల్లో నిర్దోషిగా నిలబడతాడు. కోట్లకు కోట్లు పెట్టి ఫీజు చెల్లిస్తున్నప్పటికీ లూథ్రా వంటి లాయర్ కూడా చేతులు ఎత్తేశాడు అంటే ఇందులో ఏదో ఉన్నట్టే కదా? మరి దాన్ని ఎందుకు రాధాకృష్ణ చెప్పలేకపోతున్నాడు?! వ్యవస్థలను మైంటైన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఈ విషయం పలమార్లు రాధాకృష్ణనే తన కొత్త పలుకులో చెప్పాడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు కనీసం బెయిల్ కూడా దక్కించుకోలేకపోతున్నాడు అంటే అర్థం ఏమై ఉంటుంది? గతంలో పలు కేసుల్లో స్టే లు తెచ్చుకున్న చంద్రబాబు.. ఈ కేక్ విషయంలో వెనకడుగు వేస్తున్నాడు అంటే ఏదో ఉందనే కదా అర్థం! బాధ్యతాయుతమైన మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి న్యూట్రల్ గా ఉండాల్సింది పోయి.. ఇలా అడ్డగోలుగా రాయడం ఏంటో, ఒక పార్టీకి భజన చేయడం ఏమిటో రాధాకృష్ణకే తెలియాలి.

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ సంస్థను ఇరికించి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిని కూడా జగన్ అరెస్టు చేస్తాడని రాధాకృష్ణ వాపోయాడు. అంటే ఆ వ్యవహారంలో ఏవో అవకతవకలు జరిగాయని రాధాకృష్ణ చెబుతున్నాడా? ఇందులో నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరికి ప్రమేయం ఉందని అంటున్నాడా? అందుకే వారి అరెస్టు జరుగుతుందని ముందుగానే చెబుతున్నాడా? స్కిల్ కేసులోనూ చంద్రబాబు అరెస్టును ముందుగానే రాధాకృష్ణ ఊహించాడు. ఇప్పుడు కూడా ముందుగానే చెబుతున్నాడు అంటే ఏదో తేడా ఉంది అని అర్థం.. అలాంటప్పుడు ప్రభుత్వం అరెస్టు చేయకుండా ఎలా ఉంటుంది? ఉదయం లేస్తే తన పత్రికలో ఆయుధం ఉంది, తన ఛానల్ లో దమ్ముంది అని వీరలెవల్లో ప్రచారం చేసుకునే రాధాకృష్ణ.. స్కిల్ కేసులో ఎందుకు చంద్రబాబును వెనకేసుకొస్తున్నాడు?

    వైయస్ జగన్మోహన్ రెడ్డి 43 వేల కోట్ల ప్రజల సొమ్ము తిన్నాడని చెబుతున్న రాధాకృష్ణ.. 371 కోట్లను ఆఫ్ట్రాల్ అని సంబోధించడం ఏమిటి? అక్రమం ఏదైనా అక్రమమే కదా.. దోపిడీ ఏదైనా దోపిడే కదా! జగన్ తప్పు చేస్తే నాడు అతడు 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అప్పుడు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ను రాధాకృష్ణ ఏ స్థాయిలో పొగిడాడో, తన పత్రికలో ఏ స్థాయిలో వార్తలు రాశాడు అందరికీ తెలుసు. చివరికి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కథనాలు రాసేందుకు కూడా రాధాకృష్ణ వెనుకాడ లేదు. అక్కడిదాకా ఎందుకు జగన్ బెయిల్ కు పిటిషన్ చేసిన ప్రతిసారీ కోర్టు తిరస్కరించింది. దీనిపై అప్పట్లో తన పత్రికలో “జగన్ కు షాక్, జగన్ కు ఎదురుదెబ్బ, కోర్టు మొట్టికాయలు” అని రాసిన రాధాకృష్ణ.. స్కిల్ కేసులో చంద్రబాబు కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే మాత్రం.. వేరే విధంగా వార్తలు రాసుకు వచ్చాడు. అంటే జగన్ అక్రమం చేశారు కాబట్టి అది అక్రమం.. చంద్రబాబును స్కిల్ కేసులో జైల్లో వేస్తే మాత్రం అది తెలుగుజాతికి ద్రోహం.. ఇదీ సదరు దమ్మున్న పత్రిక యజమాని చెబుతున్న సూక్తి ముక్తావళి. స్థూలంగా ఒక్కటి మాత్రం నిజం.. ఒకప్పుడు టిడిపికి తెరవెనక మాత్రమే సపోర్ట్ చేసిన రాధాకృష్ణ.. గంగ చంద్రముఖిగా మారినట్లు.. ఇప్పుడు పూర్తిగా పసుపు కార్యకర్త అయిపోయాడు. పోతురాజు లాగా చర్నాకోలు పట్టుకొని శరభ శరభ అ శరభ శరభ అంటూ పసుపు రంగు ఒంటికి పూసుకొని నర్తిస్తున్నాడు