Liquor: మందు బాబులకు ఈసి షాక్

ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా పై సైతం అధికారులు దృష్టి పెట్టారు. ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యంఫై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Written By: Dharma, Updated On : April 11, 2024 3:15 pm

Liquor

Follow us on

Liquor: మందుబాబులకు షాక్. షాపులు ఎప్పుడు తెరుస్తారో? ఎప్పుడు మూతపడతాయో? తెలియని పరిస్థితి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ ప్రారంభమైంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పరిమితమైన మద్యం విక్రయించేందుకు నిర్ణయించారు. ఎన్నికల్లో మద్యం ప్రవాహం అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఈ సమయానికి ఎంత మద్యం విక్రయించారో.. అంతే అమ్మాలని.. అంతకుమించి విక్రయించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరిమిత సంఖ్యలో మద్యం విక్రయించి సిబ్బంది షాపులను మూసివేస్తున్నారు. అయితే ఇది తెలియని మందుబాబులు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.

ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా పై సైతం అధికారులు దృష్టి పెట్టారు. ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యంఫై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యంను ఒక అస్త్రంగా వాడుకుంటాయి. దీనికి తోడు వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో బీర్లకు డిమాండ్ ఉంటుంది. దీంతో మద్యం దుకాణాలు ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతుండడంతో.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ డిపోల నుంచి భారీగా మద్యం నిల్వలను ఎత్తివేయాల్సి వస్తుంది.

మద్యం నిల్వల ఎత్తివేత, అమ్మకాలపై ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం ఎక్సైజ్ అధికారులు నమ్మకాలపై ఆంక్షలు విధించారు. నిల్వల ఎత్తివేత పై కూడా అవే ఆంక్షలను కొనసాగించారు. అయితే రాత్రి ఉన్న షాపు మరుసటి రోజు మూతపడుతుండడంతో మద్యం బాబులు తలలు పట్టుకుంటున్నారు. 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపులో ఎంతవరకు అమ్మకాలు జరిగాయో.. అంతే ఈసారి విక్రయాలు జరగాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంతవరకు విక్రయించి షాపులను సిబ్బంది మూసివేస్తున్నారు. ఇది తెలియని మందుబాబులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో సిబ్బందికి హైరానా తప్పడం లేదు.