YS Jagan – Ramoji Rao : ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఈనాడులో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న కొలది ప్రజా వ్యతిరేకతను పెంచేలా సమగ్ర వివరాలతో కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే వీటిని సాక్షి మీడియా ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఈనాడులో వచ్చిన కథనాలను ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రత్యేక కాలమ్ ను ఏర్పాటుచేసి గట్టిగానే వివరణ ఇస్తున్నారు. అయితే ఈనాడులో వచ్చిన కొన్ని కథనాలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా చెబుతుండడం విశేషం. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ దిగజారిందని.. నాడు నేడు ద్వారా భారీ అవినీతి జరిగిందని.. ఆన్లైన్ విద్యాబోధన పేరిట ప్రైవేటు సంస్థలకు వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఈనాడులో ప్రత్యేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పదో తరగతి ఫలితాల నేపథ్యంలో ఈనాడులో వచ్చిన కథనం చర్చనీయాంశంగా మారింది.
2019 కంటే ముందు.. అంటే టిడిపి ప్రభుత్వ హయాంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని ఈనాడులో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని నిజాలను బయటపెట్టారు. రాష్ట్ర సరాసరి కంటే జడ్పీ, పురపాలక ప్రభుత్వ బడుల్లో 8.11% తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని.. వీటిలో చదివిన 67 వేల 393 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని… ఐఎఫ్బిలు, టోఫెల్, బైజుస్ ట్యాబులంటూ హడావుడే తప్ప ఫలితాల్లో వెనుకంజ వేశారని ఈ కథనంలో రాసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చూచి రాతలు పెరిగాయని.. అభ్యసన సామర్ధ్యాలు తగ్గాయని తెలియజేప్పే ప్రయత్నం చేశారు.
అయితే చివర్లో సున్నా ఫలితాలు విషయంలో మాత్రం ఈనాడు కథనం జగన్ కు అనుకూలంగా మార్చేసింది. 2019లో 0 ఫలితాలు సాధించిన పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు రెండు నమోదు కాగా.. ఎయిడెడ్ ఒకటి.. ప్రభుత్వ పాఠశాలలను జీరోగా చూపించారు. అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత మెరుగుపడినట్టే కదా? 2022లో ప్రైవేటు పాఠశాలలు 31, ఎయిడెడ్ పాఠశాలలు 18, ప్రభుత్వ పాఠశాలల్లో 22లో సున్నా ఫలితాలు వచ్చాయి. అంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో 0 ఫలితాలు తగ్గినట్టే కదా? 2023లో ప్రైవేటు పాఠశాలలు 22, ఎయిడెడ్ పాఠశాలలు 7, ప్రభుత్వ పాఠశాలలు తొమ్మిదింటిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇక్కడ కూడా ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరిగిపడినట్టే కదా? 2024లో 13 ప్రైవేట్ పాఠశాలలు, మూడు ఎయిడెడ్ పాఠశాలలు, ఒక్క ప్రభుత్వ పాఠశాలలో సున్నా ఫలితాలు వచ్చాయి. అంటే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడినట్టే కదా? అయితే మొత్తం కథనంలో ప్రభుత్వ వ్యతిరేకతను చూపించగా.. 0 ఫలితాలు విషయానికి వచ్చేసరికి జగన్ అనుకూల వైఖరి కనిపించింది. ఈ కథనం విషయంలో రామోజీరావు జగన్ కు ఫేవర్ చేసినట్టే కనిపిస్తోంది.