Priyankagandhi : వైఎస్ సమాధి వద్దకు ప్రియాంకగాంధీ.. కాంగ్రెస్ తో షర్మిల.. కీలక పరిణామాలు

జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి షర్మిళతో పాటు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్టు సమాచారం. అదే రోజు షర్మిళ కీలక ప్రకటన వెలువరించే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఏ కాంగ్రెస్ ను విభేదించి బయటకు వచ్చారో అదే పార్టీలోకి వైఎస్ కుటుంబం వెళుతుందన్న మాట.

Written By: Dharma, Updated On : June 21, 2023 2:35 pm
Follow us on

Priyankagandhi : కాంగ్రెస్ పార్టీ మహా సముద్రంలాంటిది. ఎంత మంది నాయకులు వచ్చినా తనలో ఇముడ్చుకుంటుంది. ఆ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన వారు సైతం తిరిగి రీ బ్యాక్ అవుతుంటారు. హేమాహేమీలు సైతం తిరుగుముఖం పట్టిన సందర్భాలున్నాయి. ఏపీలో కూడా అటువంటి సిట్యువేషన్ క్రియేట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. సోదరుడు జగన్ వదిలిన బాణం షర్మిళను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించింది. ఆమెను తమ వైపు తిప్పుకోవడంలో ఇప్పటికే సక్సెస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అధికారం కోసం జగన్ పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన తండ్రి మరణంతో ఆగిన గుండెలు, బలవన్మరణాలకు పాల్పడిన వారి కుటుంబాలకు పరామర్శకు జగన్ ప్రయత్నించారు. దీనికి కాంగ్రెస్ నాయకత్వం అనుమతివ్వలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ సీపీని స్థాపించారు. అనక కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహానికి గురై జగన్ జైలుపాలయ్యారు. ఆ సమయంలో జగనన్న వదిలిన బాణంగా సోదరి షర్మిళ అన్నీతానై వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయినా అనుకున్నది సాధించలేకపోయారు.
గత ఎన్నికల్లో ఏపీలో జగన్ విజయానికి షర్మిళ సంపూర్ణ సహకారం అందించారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పట్టించుకోవడం మానేశారు. దీంతో సోదరుడి ప్రమేయం లేకుండా తెలంగాణ వైఎస్సార్ పార్టీని స్థాపించి అక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి షర్మిళ సిద్ధపడ్డారు. ఇప్పటికే బహుముఖ పార్టీలు ఉన్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలో వైఎఆర్ టీపీకి మైలేజ్ రావడం లేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో సోదరుడు జగన్ తో అగాధం మరింత పెరిగింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిళకు ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే మంచి పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.
ఈ ప్రచారానికి తగ్గట్టే షర్మిళ వ్యవహార శైలి ఉంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో అక్కడి కీలక నేత, డిప్యూటీ సీఎం, ట్రబుల్ ష్యూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను షర్మిళ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మధ్యవర్తిత్వం మేరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిళతో చర్చలు జరిపిందని.. ఏపీ బాధ్యతలు షర్మిళకే అప్పగించే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే సోనియా, రాహుల్ లు సానుకూలత వ్యక్తపరచారని.. జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి షర్మిళతో పాటు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్టు సమాచారం. అదే రోజు షర్మిళ కీలక ప్రకటన వెలువరించే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఏ కాంగ్రెస్ ను విభేదించి బయటకు వచ్చారో అదే పార్టీలోకి వైఎస్ కుటుంబం వెళుతుందన్న మాట.