Balineni political journey: బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ).. రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సాధించారు ఈ నేత. తొలుత కాంగ్రెస్ పార్టీలో.. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన హవాను చాటుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉండడంతో బాలినేని బలమైన నాయకుడిగా మార్చేందుకు దోహద పడింది. ఒంగోలు జిల్లా రాజకీయాలను తన కనుసైగతో శాసించారు. ఆయన సిఫారసు ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్లు లభించేవి. ఆయన ప్రాపకం ఉన్నవారే ఎంపీలు అయ్యేవారు. అటువంటి బాలినేని ఇప్పుడు జనసేనలో ఒంటరిగా మిగిలారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఇప్పుడు బాలినేని ఉనికి కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా..
యువజన కాంగ్రెస్( Youth Congress ) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వై వి సుబ్బారెడ్డి కి స్వయాన బావ. అలా వైయస్ రాజశేఖర్ రెడ్డి తో బంధుత్వం కుదరడంతో బాలినేని పొలిటికల్ ఎంట్రీ చాలా సులువుగా జరిగిపోయింది. యువజన కాంగ్రెస్ లో ఉన్న బాలినేని పిలిచి టిక్కెట్ ఇచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అలా తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే చిన్న వయసులోనే మంత్రి పదవి ఇచ్చి మరింత ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. అలా అమాత్య అని తొలిసారిగా అనిపించుకున్నారు బాలినేని. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవిని వదులుకొని మరి జగన్ వెంటే అడుగులు వేశారు బాలినేని. దానికి కారణం వారి మధ్య ఉన్న బంధుత్వమే. అయితే మంత్రి పదవి వదులుకొని తన వెంట నడిచిన బాలినేనికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఏకంగా ప్రకాశం జిల్లా బాధ్యతలు కేటాయించి.. అక్కడ ఆయనకు ఎదురేలేదన్నట్టు అవకాశాలు ఇచ్చారు జగన్.
మంత్రి పదవిని వదులుకొని..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం తర్వాత.. 2014లో ఆ పార్టీ తరఫున ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు బాలినేని. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మండలిలో కూర్చోబెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా బాలినేని ఎన్నిక కావడంతో మంత్రిగా అవకాశం కల్పించారు. కీలక పోర్టు పోలియో ఇచ్చారు. అయితే మంత్రివర్గ విస్తరణలో.. సామాజిక సమీకరణల దృష్ట్యా పదవి నుంచి తొలగించారు. అది మొదలు బాలినేనిలో అసంతృప్తి ప్రారంభం అయింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పతాక స్థాయికి చేరింది. తనకు గౌరవం ఇవ్వని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని చెప్పి.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం ప్రారంభించారు.
కనీస గుర్తింపు ఏది?
అయితే బాలినేని జనసేనలో( janasena ) చేరికకు ఏడాది దాటుతోంది. ఎంతో ఆర్భాటంగా జనసేనలో చేరాలనుకున్నారు బాలినేని. పవన్ అభ్యంతరాలతో సాదాసీదాగా చేరారు. అయితే బాలినేని విషయంలో పవన్ విభిన్న రీతిలో స్పందించారు. బాలినేని పై ప్రశంసలు కురిపించారు. దీంతో జనసేనలో తనకు తప్పకుండా మంచి ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేసుకున్నారు బాలినేని. ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పదవులు దక్కకపోగా జనసేనలో కూడా ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. చివరకు సొంత నియోజకవర్గ ఒంగోలులో సైతం సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. కనీసం కార్యక్రమాలకు పిలవను లేదు. ఆపై ఫ్లెక్సీలో సైతం బాలినేని ఫోటోలకు చాన్స్ లేదు. దీంతో ఒంటరిగా మిగిలిన బాలినేని అనవసరంగా జనసేనలో చేరానా? అని తెగ బాధపడుతున్నారట. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.