Ponduru Khadi: రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు నాణ్యమైన వస్త్రాలకు, అద్భుతమైన పట్టు చీరలకు, ఇంకా అనేక రకాల వింతలకు ఆలవాలం. ఇప్పుడు ఈ జాబితాలోకి మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు అనే గ్రామం కూడా చేరింది. ఈ గ్రామం ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పొందూరు గ్రామం.. ఒకసారిగా అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది? ఇలా ఎదగడానికి కారణాలు ఏమున్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన చరిత్ర ఖాదీ కి ఉంది. అనేక రకాల అధునాతన వస్త్రాలు మార్కెట్ మొత్తాన్ని శాసిస్తున్న నేటి కాలంలో.. సంప్రదాయ ఖద్దరు కూడా పోటీని తట్టుకొని దర్జాగా నిలబడుతోంది. ఇందుకు కారణం ఆ వస్త్రంలో ఉన్న నాణ్యత. రెండు తెలుగు రాష్ట్రాలలో ఖద్దరు వస్త్రాలు అనేక ప్రాంతాలలో కార్మికులు నేస్తారు.. కానీ మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఖద్దరు లభిస్తుంది. ఇక్కడ కార్మికులు ఈ వస్త్రాన్ని నేస్తారు.. పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో వస్త్రాన్ని కొనుగోలు చేసి దుస్తులు కుట్టించుకుంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పొందూరు ఖద్దరు వస్త్రాలను ధరిస్తుంటారు. ఒక రకంగా ఆయన ఆ వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఎంతో నాణ్యమైన పొందూరు ఖద్దరుకు జి ఐ ట్యాగ్ లభించింది. ఖాది, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రెండు సంవత్సరాల క్రితం పొందూరు ఖాదీ భౌగోళిక మూలం, చారిత్రక నేపథ్యం, విలక్షణకు కారణమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసేది. ఆ తర్వాత జి ఐ ట్యాగ్ పొందడానికి డిక్లరేషన్, ఇతర పత్రాలను సమర్పించింది.
కేంద్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 1921లో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలను బహుకరించారు. ఆ వస్త్రాలు ఆయనను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వస్త్రం గురించి అధ్యయనం చేయాలని తన కుమారుడు దేవదాస్ గాంధీని మహాత్మా గాంధీ ఆదేశించారు. ఆ తర్వాత ఇండియా అనే పత్రికలో పొందూరు ఖాదీ వస్త్రాల గురించి మహాత్మా గాంధీ ప్రస్తావించారు. ఈ వస్త్రంలో ఉన్న నాణ్యత గురించి ఆయన పదే పదే అందులో రాసుకొచ్చారు. తాటి నుంచి నేటి వరకు పొందూరు ఖాదీ వస్త్రాలు తమ ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నాయి.
ఇక్కడి కార్మికులు నాణ్యమైన పత్తిని సేకరిస్తారు. ఆ పత్తిని సంప్రదాయ విధానంలో వడ కడతారు. గింజలను వేరు చేస్తారు. పత్తిని ఎండబెట్టి.. నూలు పోగులుగా మార్చుతారు. అనంతరం వాటిని మగ్గాల మీద వస్త్రంగా మారుస్తుంటారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రసాయన పదార్థాలను ఉపయోగించరు. అందువల్లే పొందూరు ఖాదీ ఈ స్థాయిలో ప్రత్యేకతను సొంతం చేసుకుంది.