Telugu States Politics: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. కొన్ని పార్టీల మధ్య మైత్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటోంది. నేతల వ్యవహార శైలి సైతం చాలా విభిన్నం. ఏపీలో చంద్రబాబుకు( AP CM Chandrababu) పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి తోడుగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఏపీలో భావి నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నారు. తెలంగాణలో కేటీఆర్ ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కేటీఆర్ కు సోదరి కవిత రూపంలో వ్యతిరేకత ఉండగా.. ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిల గుదిబండగా మారారు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సజ్జల, అవినాష్ రెడ్డి అండగా ఉన్నారు. తెలంగాణలో కెసిఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు.
* విరుద్ధ పార్టీలు అయినా..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పుట్టుకొచ్చింది గులాబీ పార్టీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది పక్కా సమైక్యవాదం. ఆ రెండు పార్టీల మధ్య మైత్రి విచిత్రంగా కుదిరింది. ఈ రెండు పార్టీల మధ్య మైత్రికి కారణం చంద్రబాబు. వారిద్దరికీ ఉమ్మడి శత్రువు కావడం.. ఆయన పతనానికి ఇద్దరూ కోరుకోవడంతో వారి మధ్య మైత్రి చిగురించింది. అయితే తెలుగుదేశం, జనసేన మధ్య మైత్రీకి కారణం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ లక్ష్యం. అందుకే ఆయన చంద్రబాబుకు అండగా నిలిచారు. మరో 15 సంవత్సరాల పాటు అలాగే అండగా నిలబడతానని చెబుతున్నారు.
* వారిద్దరికీ రాజకీయ మూల్యం..
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబుతో పవన్ ( deputy CM Pawan)చేతులు కలపడాన్ని ఏపీ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ పతనం కోసం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనైతిక బంధాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య, ఇద్దరి నాయకుల మధ్య ఏర్పడిన అనుబంధం ఒక పార్టీ వినాశనాన్ని.. ఒక నాయకుడి పతనాన్ని కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడిగా వైసిపి చిత్రీకరిస్తోంది. కెసిఆర్ తెరచాటు స్నేహితుడిగా జగన్మోహన్ రెడ్డిని టిడిపి ఆవిష్కరిస్తోంది. ఈ మొత్తం రాజకీయంలో మూల్యం చెల్లించుకుంది కేసీఆర్, జగన్ ధ్వయం. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం దక్కుతోంది. తెలంగాణలో కెసిఆర్ ప్రత్యర్థి, చంద్రబాబు సన్నిహితుడు రేవంత్ అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రేవంత్న సైతం వ్యతిరేకిస్తూ వచ్చారు. ఫలితంగా కెసిఆర్ తో పాటు జగన్ రేవంత్ వ్యతిరేకులుగా మారారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్యామేజ్ అయ్యింది కేసీఆర్ అండ్ జగన్ కే. కానీ ఇంకా వారు నిజాలు తెలుసుకోలేకపోతున్నారు. తమ మధ్య ఉన్న బంధాన్ని వదులుకోలేకపోతున్నారు.