YS Jagan Tirumala Tour Effect : వైసీపీ అధినేత తిరుమల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో జగన్ పర్యటన ఖరారు అయింది. శుక్రవారం సాయంత్రం జగన్ తిరుమల చేరుకోనున్నారు. శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. అయితే జగన్ అన్య మతస్థుడు కావడంతో.. డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే స్వామివారిని దర్శించుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీటీడీ సైతం జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం దేవాదాయ శాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోనుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ డిక్లరేషన్ ఇవ్వరని టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలలో అడుగు పెడతారని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
* పోలీస్ యాక్ట్ అమలు
తిరుమలలో ఇప్పటికే సెక్షన్ 3 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సభలు, సమావేశాలకు అనుమతి లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ ను రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చింది. జగన్ పర్యటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు తిరుపతి జిల్లాకు చేరుకున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలను తిరుపతికి రప్పించారు.
* భారీగా తరలివస్తున్న వైసీపీ శ్రేణులు
ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీగా తిరుమల చేరుకుంటున్నాయి. అదే సమయంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, స్వామీజీలు సైతం పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పుడే తిరుమలలో జగన్ గో బ్యాక్ అన్న నినాదాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పార్టీల శ్రేణులకు కీలక పిలుపు ఇచ్చారు. దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అయితే అదే సమయంలో జగన్ ను రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులు డిసైడ్ కావడం ఆందోళన కలిగిస్తోంది.
* అలా అయితే అభ్యంతరం లేదు
అయితే జగన్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జగన్ ఒక్కరే వచ్చి దర్శించుకుంటే ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకూడదని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ శ్రేణులు బలప్రదర్శనకు దిగితే మాత్రం పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమల తో పాటు తిరుపతి జిల్లాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు పోలీసులు. వైసిపి నేతల కదలికలపై దృష్టి పెట్టారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘించి తోక జాడిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.
* సర్వత్రా ఆందోళన
జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. దీంతో స్థానికులు సైతం ఆందోళన చెందుతున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపీ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను నివృత్తి చేసే క్రమంలో జగన్ ఎలా స్పందిస్తారు? ఏం మాట్లాడుతారు? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే వేలాదిమంది పోలీసులు తిరుమల కు చేరుకున్నారు. మరోవైపు జగన్ డిక్లరేషన్ ఇస్తేనే అనుమతించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిక్లరేషన్ ఇచ్చే ప్రసక్తి లేదని వైసీపీ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో పరిస్థితి ఎటువైపు దారితీసుకుందోనన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది.