Liquor Shops Permit Room: ఏపీలో( Andhra Pradesh) మందుబాబులకు గుడ్ న్యూస్. ఇకనుంచి పోలీసులకు భయపడనవసరం లేదు. దొంగ చాటున మందు తాగాల్సిన పనిలేదు. షాపులు వద్దే ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్కడే తీరుబాటుగా మద్యం సేవించడానికి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల చెంతనే పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా.. ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. మద్యం దుకాణాల పక్కనే వీటిని ఏర్పాటు చేయాలని.. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ పర్మిట్ రూముల ఏర్పాటుతో మందుబాబులకు సౌకర్యం ఒకవైపు.. ప్రభుత్వానికి ఆదాయం మరోవైపు రానుంది.
Also Read: ఇలా జరుగుతుందని జగన్ కి ముందే తెలుసా? అందుకే సిద్ధమవుతున్నాడా?
* వేర్వేరుగా రుసుము
పర్మిట్ రూములకు( permit room ) సంబంధించి రుసుం చెల్లింపు విధానం ఉంది. రూ.55 లక్షల లోపు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు పర్మిట్ రూమ్ కోసం రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.65 నుంచి రూ.85 లక్షల వరకు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు రూ. 7.50 లక్షలు చెల్లించాలి. దీనిని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా నిర్ణయించారు. నవంబర్ పదిలోగా ఈ రుసుము చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా పర్మిట్ రూముల కోసం ప్రతి దుకాణదారులు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది. పర్మిట్ రూములలో వంటలకు అనుమతి లేదు. రెడీ టు ఈట్ స్నాక్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.
* ఆ నిబంధనలతో..
ఈ పర్మిట్ రూముల్లో మద్యం తాగేవారికి ప్రత్యేకంగా మద్యం అందించకూడదు. షాపులో కొనుగోలు చేసి ఆ రూముల్లో తాగాల్సి ఉంటుంది. మద్యం షాపులు తెరిచిన వేళల్లోనే పర్మిట్ రూములు కూడా తెరిచి ఉంచాలి. అలాగే పర్మిట్ రూములలో పరిశుభ్రత పాటించాలని.. తాగేందుకు, చేతులు కడుక్కునేందుకు నీళ్లు కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది ప్రభుత్వం. పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు షాపుల యజమానులు. మందుబాబులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉండనుంది. బహిరంగంగా మద్యం సేవించకుండా అడ్డుకునేందుకు పర్మిట్ రూమ్ లకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
* నిల్చొని తాగేందుకు
అయితే ఇప్పటివరకు మద్యం షాపుల చుట్టూ అనధికారికంగా చిరు దుకాణాలు వెలిసాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా పర్మిట్ రూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్మిట్ రూమ్ అంటే మద్యం షాపు పక్కన ఒక గది మాత్రమే ఉంటుంది. అక్కడ నిలబడి మందు తాగేందుకు అవకాశం ఉంటుంది. బార్ లో ఉన్నట్టు కుర్చీలు, టేబుల్స్ ఉండవు. గత ఏడాది అక్టోబర్లో మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. పర్మిట్ రూములకు అనుమతి లేకపోవడంతో.. మందుబాబులు రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చేశారు. దీంతో సమీప నివాసితులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీనిపై ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చింది.