Jagan: ఇటీవల బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోరీ పేరుతో రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం విపరీతంగా వచ్చారు. దీంతో మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తుందని.. ఎన్ డి ఏ కూటమికి ఓటమి తప్పదని.. బీహార్ ఎన్నికల నుంచే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని అందరూ జోష్యం చెప్పారు. కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. రాహుల్ గాంధీ సభలకు భారీగా జనం రావడంతో చాలామంది విశ్లేషకులు వారందరిని పాజిటివ్ ఓటు బ్యాంకు గా పరిగణించారు.. కానీ సభలకు వచ్చినవారు, సమావేశాలకు హాజరైన వారు ఓట్లు వేయలేదు. బీర్లు, బిర్యానీలు తీసుకుని వెళ్లిపోయారు.
రాజకీయ పార్టీలు ఏ స్థాయిలో అయితే జనాలను మోసం చేయడానికి అలవాటు పడ్డాయో.. జనాలు కూడా అంతకంటే తెలివిగా రాజకీయ పార్టీలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. అందువల్లే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఊహించిన విధంగా ఫలితాలు వస్తున్నాయి. అధికారం ఖాయం అనుకున్నవారు ప్రతిపక్షానికి పరిమితమవుతున్నారు. ప్రతిపక్షానికి పరిమితం అవుతారనుకున్నవారు అధికారాన్ని దక్కించుకుంటున్నారు. గతంలో రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు ఉండేవి కాదు. డబ్బు, ఇతర వ్యవస్థలు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి.
బీహార్లో రాహుల్ గాంధీ సభకు వచ్చినట్టుగానే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న ప్రతి ప్రాంతానికి జనాలు వస్తున్నారు. ఈ జనాలను ముందుగానే సమీకరించాలని తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందువల్లే జనాలను విపరీతంగా సమీకరిస్తున్నారని కూటమినేతలు ఆరోపిస్తున్నారు. ఈ స్థాయిలో జనం రావడం వల్ల వైసీపీ అనుకూల మీడియా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తుంది. వాస్తవానికి వచ్చిన జనం మొత్తం ఓట్లు వేయరు. సభకు వచ్చినందుకు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోతారు. వాస్తవానికి ఆ పూటకు కూలి గిడితే సరిపోతుందని అనుకుంటారు.. వాస్తవానికి నేటి రోజుల్లో చాలామంది కష్టపడకుండానే డబ్బులు రావాలని కోరుకుంటున్నారు.. సభలకు, సమావేశాలకు వస్తే ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. అదనంగా బీరు, బిర్యానీ వస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు..
ఇటీవల జగన్ బెంగళూరు నుంచి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. రైతుల సమస్యల మీద పోరాడుతున్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడనే ప్రశ్న జగన్ మోహన్ రెడ్డి లో గనక వ్యక్తం అయితే తమ పరిపాలనపై విమర్శలు చేయడని కూటమినేతలు అంటున్నారు.. వాస్తవానికి వచ్చిన జనాన్ని జగన్మోహన్ రెడ్డి బలంగా చూపిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ దే అధికారమని వైసిపి మీడియా డబ్బాలు కొడుతోంది. కానీ వచ్చిన జనం ఓట్లు వేయరని.. జన సమీకరణలో భాగంగానే వారంతా వచ్చారనే విషయాన్ని మర్చిపోతోంది.. చివరికి రాప్తాడులో వివాహ వేడుకకు హాజరైన జగన్ తన బల ప్రదర్శన నిరూపించుకోవడానికి ప్రయత్నించడం రాజకీయాల్లో సరికొత్త అంకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.