Peddi Reddy Family: జైలు నుంచి విడుదలైన మిధున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) ఎందుకు కలవలేదు? జగన్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు తన ఇంటికి పిలవలేదు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సడన్ గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? చంద్రబాబుతో ఎటువంటి ఒప్పందం లేదని ఎందుకు చెప్పారు? చివరివరకు జగన్మోహన్ రెడ్డి తోనే తాము నడుస్తామని ఎందుకు ప్రకటించారు? చంద్రబాబు తమను వేధిస్తున్నారని ఎందుకు చెప్పారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చంద్రబాబుకు ప్రత్యర్థి. ఆపై దశాబ్దాల వైరం. అదే పెద్దిరెడ్డి వైయస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి తో మంచి అనుబంధము ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అడుగులు వేసింది ఈ కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తరువాత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అయితే సడన్ గా ఈ పరిణామాలు ఏంటి? అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైన చర్చ. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి.
* జగన్ కోసం పరితపించిన పెద్దిరెడ్డి..
జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy ). అప్పట్లో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించి.. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రాయలసీమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టే విధంగా పావులు కదిపారు పెద్దిరెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డిని ఆశ్చర్యపరిచాయి. పెద్దిరెడ్డి పై అనుమానం పెంచాయి. రాయలసీమ మొత్తం కూటమి ప్రభంజనం సృష్టిస్తే.. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అన్నది జగన్మోహన్ రెడ్డిలో పుట్టుకొచ్చిన అనుమానం. ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? అన్నంతగా అనుమానం పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి క్రమేపి పెరుగుతూ వచ్చాయి. పెద్దిరెడ్డి కుటుంబాన్ని జగన్ దూరం చేసుకునే పరిస్థితి వచ్చినట్లు బయట ప్రచారం జరుగుతోంది.
* సజ్జల పాత్ర పై అనుమానం..
అయితే ఈ మొత్తం పరిణామాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )ఉన్నారు అన్నది ప్రధాన ఆరోపణ. బయట కూడా అదే ప్రచారం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగిన నేతలను.. ఒక పద్ధతి ప్రకారం బయటకు పంపించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందన్నది ఒక అనుమానం. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆధిపత్యాన్ని సహించలేకపోయారట సజ్జల. పైగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూసేవారు. పార్టీ కోసం తాము కష్టపడితే ఆర్థికంగా పెద్దిరెడ్డి కుటుంబం బలోపేతం అయింది అన్నది సజ్జలలో ఉన్న అనుమానం అని వైసిపి వర్గాలు అంతర్గత చర్చలో చెబుతుంటాయి. అందుకే ఒక వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డిలో అనుమానాలు పెంచడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే లిక్కర్ కుంభకోణం జరిగిన తర్వాత పూర్తిగా సీన్ మారినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల ఒప్పందాలు జరిగినట్టు.. కూటమి ప్రభుత్వానికి పెద్దిరెడ్డి కుటుంబం సరెండర్ అయినట్లు ఒక కొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. ఇవన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికి తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఒక్క వ్యూహంతో వైసీపీలో పెద్దిరెడ్డి ప్రత్యర్థులు ప్రచారం మొదలు పెట్టినట్లు సమాచారం. ఆయన ముందు ఏకైక ఆప్షన్ బిజెపి అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
* వల్లభనేని వంశీ విషయంలో అలా..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను( Vamsi Mohan) స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. అటు తరువాత ఆయన బెయిల్ కోసం కూడా న్యాయ సహాయం చేశారు జగన్ మోహన్ రెడ్డి. జైలు నుంచి బయటకు వచ్చాక తన ఇంటికి పిలిపించుకొని మరి వల్లభనేని వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి విషయంలో అలా చేయలేదు. కనీసం పరామర్శించలేదు. తన ఇంటికి పిలవలేదు. అదే సమయంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. తమను చంద్రబాబు వేధించారని.. అతనితో ఎటువంటి ఒప్పందాలు లేవని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి తోనే చివరి వరకు ప్రయాణం అని ప్రకటించారు. ప్రత్యేకంగా ఈ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ తో పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ స్థాయిలో సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడైతే మిధున్ రెడ్డి ఆ ప్రకటన చేశారు తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో సజ్జల వైపే అందరి వేళ్ళు చూపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.