Pawankalyan : పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసేందుకు పవన్ రానున్నారు. రెండు రోజుల కిందట ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేపడుతున్న జనసేన నాయకుడిపై సీఐ అంజూ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన వైరల్ అయ్యింది. సీఐ తీరుపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో కూడా సీఐ ఇటువంటి తప్పిదాలకే పాల్పడడంతో పవన్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పవన్ కలుగజేసుకోవాల్సి వస్తోంది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం పవన్ ఢిల్లీ పయనం కానున్నట్టు తెలుస్తోంది.
పవన్ తిరుపతి రానున్నారని తెలియడంతో పోలీస్ శాఖ అలెర్టయ్యింది. సీఐ తీరుతో పోలీస్ శాఖకు మాయని మచ్చ పడుతోందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాజకీయ పార్టీల నేతలే కాకుండా సామాన్యుల పట్ల ఆమె అనుచితంగా ప్రవర్తిస్తుండడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా ఎస్పీ డీజీపీకి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఆమెకు నోటీసు ఇవ్వడంతో పాటు వేటు వేసేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిని శ్రీకాళహస్తి సీఐ బియ్యపు మధుసూధనరెడ్డి అడ్డుకుంటున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎస్పీని కలిసేందుకు పవన్ తో పాటు మరో ఏడుగుర్ని మాత్రమే పోలీస్ శాఖ అనుమతించినట్టు సమాచారం. పవన్‌తోపాటు బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీకాళహస్తి ఇన్‌చార్జి నగరం వినుత, మదనపల్లె ఇన్‌చార్జి రామదాస్ చౌదరితోపాటు అడ్వకేట్లు అమరనారాయణ, కంచి శ్యాములు ఎస్పీని కలవనున్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ ఉదయం 9.30 తిరుపతి పాత విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఎస్పీ కార్యాలయానికి 11 గంటలకు చేరుకుంటారు. వినతిపత్రం అందించిన తరువాత నేరుగా విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ పయనం కానున్నారు. కాగా భారీ నిరసన ర్యాలీకి జనసేన వర్గాలు నిర్ణయించాయి. జన సైనికులు పెద్దఎత్తున తరలిరావాలని కోరాయి.