OG vs Onion price: ఏపీలో చాలావరకు సమస్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తున్నాయి. ఆయన దృష్టికి తీసుకువెళ్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నది ప్రజల ఆశ. ఈ నేపథ్యంలో ఓ పదేళ్ల బాలుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా చేసిన విజ్ఞప్తి ఇప్పుడు వైరల్ అంశంగా మారింది. ఇటీవల పవన్ నటించిన ఓజి సినిమా రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు కూడా.
ఉల్లి ధరతో పోల్చుతూ..
ప్రస్తుతం ఉల్లి ధర పతనం అయింది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉల్లి పండుతోంది. దిగుబడి పరంగా పర్వాలేదనుకున్నా.. ధర పరంగా మాత్రం తగ్గుముఖం పట్టింది. కర్నూలు మార్కెట్లో క్వింటా వెయ్యి రూపాయలు కూడా దాటడం లేదు. దాదాపు మూడు నెలల పాటు అహోరాత్రులు శ్రమిస్తే కానీ ఉల్లి పండదు. పైగా ఎక్కువగా నీరు సదుపాయం ఉండాలి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రైతులు పండించిన ఉల్లి ప్రస్తుతం చేతికి అందింది. కానీ ధర కనీస స్థాయిలో లేదు. దీంతో మార్కెట్లకు తేవడం మానేస్తున్నారు రైతులు. రైతుల కంట కన్నీరు కారుతోంది.
వీడియో వైరల్..
అయితే ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేశాడు ఆ బాలుడు. ఓజి సినిమా టికెట్ ధర 1400 రూపాయలు ఉంటే.. రైతు పండించే ఉల్లి వెంట వెయ్యి రూపాయలు కూడా దాటడం లేదని.. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అంటూ ఆ బాలుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని.. ఆయన నటించిన ఓజి సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పిన ఆ బాలుడు.. రైతుల సమస్యలు పట్టించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రస్తుతం ఆ బాలుడు సోషల్ మీడియాలో వీడియో తో హల్ చల్ చేస్తున్నాడు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.
చిన్న పిల్లాడు అయినా చాలా కరెక్ట్ గా చెప్పాడు.. ఏం పవన్ కళ్యాణ్ ఈ కుర్రాడికి ఉన్న ఆలోచన కూడా నీకు లేకపోయిందా? pic.twitter.com/dmM15qCZ97
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) October 6, 2025