Pawan Kalyan : అకాల వర్షాల ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయానికి వర్షాలు ముంచెత్తడం అన్నదాత పాలిట శాపంగా పరిణమించింది. ఆదుకోవాల్సి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత రైతుల గోస వినేందుకు కదిలారు. నీటిలో తడిచి ఇంకా కళ్లాల్లోనే ఉన్న పంటను చూసి చలించిపోయారు. రైతుల ఆక్రందనలు విని ఆవేదన లోనయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న నేరుగా బొమ్మూరు, రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆవలో పర్యటించారు. అక్కడ నుంచి కడియం, అవిడి, పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడాలని రైతులు ఎగబడుతూ ధాన్యాన్ని తొక్కుతుంటే, అది చూసిన ఆయన వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని సూచించారు. అక్కడే గుట్టలుగా పోసి ఉన్న తడిసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హడావిడిగా కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు చూపించారు. మొలకలు వచ్చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.
https://twitter.com/gopal_karneedi/status/1656221494760861696?s=20
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇళ్లలో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించాం.. రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడి పెడితే వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది” అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వడ్డీలు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టామని తీవ్రంగా నష్టపోయామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని వాపోయారు. “పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదని బాధను వెళ్లగక్కారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయారని ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని పేర్కొన్నారు. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదని చెప్పారు. రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్ పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.