Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు? ఒకచోట పోటీ చేస్తారా? రెండు చోట్ల పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారు? ఏపీలో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దాదాపు అన్ని పార్టీల కీలక నాయకుల నియోజకవర్గాల పై స్పష్టత వచ్చింది. జగన్ పులివెందుల నుంచి, చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి, అచ్చెనాయుడు టెక్కలి నుంచి, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తారని తేలిపోయింది. కానీ జనసేన అధినేత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం స్పష్టత లేదు.
పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై రకరకాల చర్చ నడిచింది. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక తో పాటు భీమవరం నుంచి బరిలో దిగి రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి పోటీకి గట్టి ఆలోచన చేస్తున్నారు. బలమైన నియోజకవర్గాల నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేశారు. భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం నుంచి బరిలో దిగుతారని టాక్ నడుస్తోంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు తొంబై వేలకు పైగా ఉండడంతో గెలుపు సునాయాసం అని పవన్ భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ స్థానానికి సంబంధించి పిఠాపురం నుంచే పోటీ చేసే ఛాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అయితే పవన్ ఒకచోటకు మాత్రమే పరిమితం కాదని.. రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎమ్మెల్యే కాదు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరాంధ్రలో ఏ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అన్న చర్చ బలంగా నడుస్తోంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్లమెంట్ స్థానం పరిధిలో ఓ ఇల్లును కూడా నాగబాబు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ ఎంపీగా పోటీ చేయనుండడంతో నాగబాబు ఖాళీ చేసినట్లు సమాచారం. ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే కేంద్రంలో మంత్రి అయి చక్రం తిప్పాలని పవన్ భావిస్తున్నారు. అటు బిజెపి పెద్దల ఆలోచన సైతం అలానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పవన్ పోటీ చేయాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి దీనిపై పవన్ ఏమంటారో? ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.
గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే తో పాటు ఎంపీగా గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. అటు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రానుండడంతో బలమైన మిత్రపక్షంగా జనసేనను తీర్చిదిద్దాలని చూస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇటు ఎమ్మెల్యేగా, అటు ఎంపీగా పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈసారి పవన్ గట్టి వ్యూహంతోనే ఉన్నారు. మరి ఆయన వ్యూహాలు ఫలిస్తాయో? లేవో? చూడాలి.