Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కుతోంది. ఆపై కేంద్ర ప్రభుత్వ సహకారం దండిగా అందుతోంది. ఏపీలో కూటమి సక్సెస్ కావడం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. దానిని ఎంతగానో గుర్తించారు చంద్రబాబు. ప్రభుత్వంతో పాటు పాలనలో కూడా జనసేనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు సైతం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చింది సీఎం చంద్రబాబు. అయితే ఇప్పుడు కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడం గమనార్హం. రకరకాల కారణాలు చూపుతూ అక్కడి అధికారులు, సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు.
* ప్రధానితో పాటు సీఎం ఫోటోలు..
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని( Prime Minister) ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ తొలిసారిగా ఏపీలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఆదేశించారు. దానికి కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట సమయంలోనే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తు కుదుర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపిని కలిపారు. ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం తీసుకొచ్చి పొత్తు పెట్టుకున్నారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని కూటమికి అండగా నిలబడేలా చేశారు. శతశాతం విజయంతో జనసేన రికార్డ్ సృష్టించింది. వీటన్నింటినీ పరిగణలో తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తగిన గౌరవం ఇవ్వాలని భావించారు చంద్రబాబు. అందుకే ఆయన ఫోటో పెట్టించారు. అయితే 2014లో చంద్రబాబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. జగన్ హయాంలో రెండు విడతల్లో పదిమంది డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వారందరికీ లేని గౌరవం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు.
* కోర్టు ఆదేశాలంటూ..
అయితే ఇప్పుడు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఫోటోలు కనిపించడం లేదు. ఇది ఏమిటని ఆరా తీస్తే కోర్టు ఆదేశాలంటూ అక్కడ వారు సమాధానం చెబుతున్నారు. అయితే జడ శ్రవణ్ కుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని వాదనలు వినిపించారు. కానీ కోర్టు పట్టించుకోలేదు. ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది కూడా. అయితే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నారు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోను తొలగించారు. అయితే ఈ విషయంలో రాజకీయంగా కొందరు గందరగోళం సృష్టిస్తున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగించారా? అన్న విషయంలో మాత్రం టిడిపి తో పాటు జనసేన శ్రేణులు గమనిస్తే మంచిది. లేకుంటే మాత్రం ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ తో పాటు కూటమిలో ఒక రకమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది.