Pawan Kalyan : ‘ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు’.. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో ఓ డైలాగు ఇది. పవన్ గురించి కమెడియన్ ఎంఎస్ నారాయణ చెప్పినా.. అందులో సీరియస్ ఉంది. పవన్ గురించి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన స్టార్ డమ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన గురించి నిర్మాతలు పడిగాపులు కాస్తారు. సినిమాలు తీసేందుకు దర్శకులు క్యూకడతారు. అటువంటి పవన్ కళ్యాణే సాటి నటుల విషయంలో చెప్పిన తెగువైన మాటలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. సహచర నటులపై ఉన్న గౌరవభావాన్ని తెలియజేస్తున్నాయి.
నేను మహేష్ బాబు, ప్రభాష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల కంటే గొప్ప నటుడ్ని కాదు. పాన్ ఇండియా చిత్రాలేవీ చేయలేదు. గ్లోబల్ స్టార్ ని కాదు. విదేశాల్లో నన్నెవరూ గుర్తించరు కూడా. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మా కోసం మీరు కొట్టుకోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు అందరి హీరోల అభిమానులను టచ్ చేస్తోంది. పవన్ గొప్పమనసును గుర్తించేలా చేస్తోంది. తనను తాను తగ్గించుకొని పవన్ చెప్పిన మాటలు బైబిల్ సూక్తులను గుర్తుకు తెచ్చాయి. పవన్ క్రేజ్, మేనియా గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ తన కంటే సహచర నటులకే పవన్ అగ్రతాంబూలం ఇవ్వడం అభినందనీయం.
తన బలహీనతలను బలంగా ప్రకటించుకోగల గొప్ప మనిషి పవన్ కళ్యాణ్. అవే తన విరోధులను సైతం ఇట్టే ఆకట్టుకుంటాయి. తన సినిమాల గురించి, రికార్డుల గురించి ఆహా ఓహో అని ఎప్పుడు చెప్పడు. అంతెందుకు తనకు డ్యాన్స్ రాదని చెప్పిన సందర్భాలున్నాయి. పలానా హిరోలా తాను నటించలేనని చెప్పిన వేదికలు ఉన్నాయి. వాస్తవానికి పవన్ లా క్రేజ్ ఉన్న హీరో తెలుగులో లేరు. ఒకానొక దశలో ఎవరూ నిలబడలేదు కూడా. కానీ పవన్ మాత్రం అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారు. రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారే కానీ.. చిత్ర పరిశ్రమపరంగా ప్రతిఒక్కరూ గౌరవభావంతో చూసిన వారే.

తనను తాను తగ్గించుకున్న పవన్ నిర్మాతలకు కొంగు బంగారమే. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా.. పవన్ సినిమా అంటేనే తెలుగు ప్రజలు పడిగాపులు కాస్తారు. హిట్, ప్లాఫ్ అన్న సంబంధం లేకుండా కలెక్షన్లను కొల్లగొట్టే కథనాయకుడుఆయనే. దర్శకుడు ఎవరనేది చూడకుండా తన మేనరిజంతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే గొప్ప మేనియా పవన్ సొంతం. వందల కోట్లతో తీసే ప్యాన్ ఇండియా సినిమాల కంటే.. రూ.100 కోట్లతో తీసే పవన్ సినిమాలే తెలుగు ప్రేక్షకులకు ముద్దు. అటువంటి పవనే తన కంటే సహచర హీరోలే మిన్న అన్న ప్రకటనలు వారి అభిమానుల మనసును తాకాయి. పవన్ దీ గ్రేట్ హీరో.. దీ గ్రేట్ లీడర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
