Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( ap deputy CM Pawan Kalyan ) తమ పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమైన పవన్ వారికి కీలక సూచనలు చేశారు. తాను ఒక్కడినే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కాదు.. మిగతా పార్టీ నేతలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు ఇచ్చి పడేయాలని సూచించారు. అలాగని ఇష్టారాజ్యంగా మాట్లాడవద్దని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగా బూతులు వద్దని సూచించారు. కూటమి పార్టీలో జనసేన ఒక భాగస్వామ్యం అని.. కూటమి అంటే ఒక్క తెలుగుదేశం మాత్రమే కాదు అని.. అందుకే ప్రభుత్వం పై విమర్శలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తే గట్టిగానే బదులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశాలు ఇవ్వడం విశేషం.
* ఆ విమర్శలకు చెక్ పెట్టాలని..
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మరో మూడేళ్ల గడువు మాత్రమే ఉంది. కూటమి కలిసికట్టుగా 15 సంవత్సరాలు పాటు ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే జనసేనలో పవన్ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విమర్శ ఉంది. పైగా కూటమిలో జనసేన నేతలు అంత కంఫర్ట్ గా లేరన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు చెక్ చెబుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. కనీస స్థాయిలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. జనసేన నేతలతోనే ఈ ప్రయోగాలు చేసి విఫలమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి నేతలను పవన్ కళ్యాణ్ సాగనంపేసారు కూడా. చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అది కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరికతోనే. ఇష్టం ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని పవన్ సూచించేసరికి.. టిడిపితో చిచ్చు పెట్టాలనుకున్న నేతలంతా జనసేనను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
* మారని పవన్ స్టాండ్..
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికలకు ముందు, తరువాత, ఇప్పుడు అదే స్టాండ్ తో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చాలామంది నేతలు వాదించారు. అటువంటి నేతలను లెక్క చేయలేదు. వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని సూచించేసరికి అప్పట్లో కొంతమంది బయటకు వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలామంది నేతలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అటువంటి వారికి కూడా చెక్ పెట్టేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటికీ కొంతమంది జనసేన నేతల వైఖరి మారడం లేదు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి అన్నట్టు ఉంది కొంతమంది నేతల అభిప్రాయం. అందుకే కూటమితో మమేకమై పని చేయలేకపోతున్నారు. అటువంటి వారికి గట్టి హెచ్చరికలు పంపారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పుడు మాట్లాడితే గట్టిగానే రిప్లై ఇవ్వండి.. పదునైన మాటలతో దాడి చేయండి కానీ బూతులు మాట్లాడవద్దని చెప్పారు పవన్. ఇకనైనా జనసేన నేతలు గట్టిగా మాట్లాడతారా? లేదా? అన్నది చూడాలి.