TDP Janasena Alliance: ఏపీ రాజకీయాల్లో చిత్ర, విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. కానీ షర్మిల రూపంలో ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. చంద్రబాబు మిత్ర ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించినందున.. తాను కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యల పైనా స్పందించారు. పొత్తు కోసమే తాను అన్ని భరిస్తున్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు రా కదలిరా పేరిట ఎన్నికల సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎక్కడికి అక్కడే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. మండపేట తో పాటు అరకు నియోజకవర్గ విషయంలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. దీనిని తప్పుపడుతూ పవన్ రాజానగరం, రాజోలు సీట్లకు పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. తాము సింగిల్ గా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ.. అధికారం రాదని తేల్చేశారు. అందుకే చంద్రబాబు రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు కనుక.. తాను కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. పొత్తు ధర్మం గురించి పవన్ మాట్లాడడం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మరి బిజెపి విషయంలో మీ పొత్తు ధర్మం ఏమైందన్న ప్రశ్నలు ఉత్తన్నమవుతున్నాయి. అది పొత్తు ధర్మానికి విరుద్ధం కాదా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నిలదీసినంత పని చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ బిజెపితో స్నేహం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా నిలిచారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుదామని నిర్ణయించుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బిజెపి, జనసేన కలిసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు కూడా పవన్ తాను ఎన్డీఏ భాగస్వామినని అని చెబుతున్నారు. తాను టిడిపితో పొత్తు కాయం చేసుకుని బిజెపిని కలిసి రమ్మని కోరడం పొత్తు ధర్మం అంటారా పవన్ అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బిజెపితో పొత్తుతో సీట్లు పంచుకొని.. ఏపీలో సీట్ల కోసం టిడిపి తో చర్చించడం సరైన విధానం అంటారా? అంటూ నేటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ కు ప్రధాని మోదీ ఎనలేని గౌరవం ఇచ్చారని.. మరి ఆ స్థాయిలో గౌరవాన్ని బిజెపికి ఇస్తున్నారా? అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.