Pawan Kalyan: తనను నమ్ముకున్న వారి కోసం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఎంత దాకైనా ముందుకు వెళ్తారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. ఆయన తీరు ఒకేలా ఉంటుంది. అయితే తాజాగా ఆయన పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకొని మరి కలుస్తున్నారు. డిప్యూటీ సీఎం గానే సాదాసీదాగా వెళ్తూ కలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఇప్పటం గ్రామంలో సరస్వతమ్మను కలిశారు. ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లాలోని కృత్తివెన్ను గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చందు వీర వెంకట వసంత రాయులు కుటుంబాన్ని కలిశారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. వారికి కొంత మొత్తంలో ఆర్థిక సాయం చేయడమే కాకుండా.. ప్రభుత్వం తరఫున కూడా భరోసా కల్పించారు. పవన్ చర్యలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. సొంత పార్టీ శ్రేణులు గుర్తించుకుంటున్నాయి.
* ఇప్పటం గ్రామ సందర్శన..
జనసేన( janasena ) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ప్లీనరీ నిర్వహించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తగిలింది. వారికి సరైన వేదిక కూడా దొరకనివ్వలేదు. ఈ క్రమంలో ఇప్పటం గ్రామస్తులు ముందుకు వచ్చి ప్లీనరీ నిర్వహణకు అవసరమైన భూమిని అందించారు. అక్కడ ప్లీనరీ సక్సెస్ అయ్యింది. దానిని మనసులో పెట్టుకొని రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామస్తులను అప్పటి వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో గ్రామస్తులను పరామర్శించారు పవన్. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సరస్వతమ్మ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను కలవాలని కోరింది. ఆమె కోరిక మేరకు ఇటీవల పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్లారు. సరస్వతమ్మను కలిశారు.
* కార్యకర్త కుటుంబానికి భరోసా..
తాజాగా కృతివెన్ను గ్రామానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. చందు వీర వెంకట వసంత రాజులు అనే వ్యక్తి జనసేన లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. జనసేన అధికారంలోకి రావాలని పూజలు కూడా చేసేవారు. అప్పట్లో ఫేమస్ అయ్యారు కూడా. అయితే ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జనసేన సభ్యత్వం ఉండడంతో బీమాకు సంబంధించిన పరిహారం దక్కింది. అయితే ఆయనలో అభ్యుదయ భావాలు అధికం. ఆయన చనిపోయినప్పటికీ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. రాయులు ఆరుగురికి అవయవ దానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తానే స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. తన పర్యటనను గోప్యంగా ఉంచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సాయం కూడా చేశారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే గోప్యంగా ఉంచినా వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. అయితే పవన్ చర్యలు సామాన్యులను సైతం ఆకట్టుకుంటున్నాయి.