Pawan Kalyan vs Bonda Uma issue: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శాసనసభలో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిలదీసినంత ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు కింద స్థాయిలో మాత్రమే టిడిపి, జనసేన మధ్య విభేదాలు నడుస్తుండగా.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టిడిపి ఎమ్మెల్యే ఉమా ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అసలు తెర వెనుక ఏం జరిగింది? అనే దానిపై సీఎం చంద్రబాబుకు నివేదిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బోండా ఉమా ప్రశ్నపై అధికారులతో సమీక్షించారు. దీంతో కూటమి మధ్య చిన్నపాటి వివాదం నడిచేలా ఉంది.
అప్పట్లో కూడా విమర్శలు..
బోండా ఉమామహేశ్వరరావు( Bonda Uma maheshwarao) టిడిపి నాయకుడు. రెండుసార్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే గతంలోనూ పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చరిత్ర బోండా ఉమాది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించేవారు పవన్ కళ్యాణ్. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఉండేవారు. పవన్ పై మాట్లాడేందుకు వారు ముందుకు వచ్చేవారు కాదు. ఆ సమయంలో మాత్రం నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు బోండా ఉమా. పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. తద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన టిక్కెట్ పదిలం చేసుకున్నారన్న టాక్ విజయవాడలో ఉంది. బోండా ఉమా ను మార్చుతారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ దూకుడు కలిగిన నేత కావడంతో చంద్రబాబు ఆ అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు బొండా ఉమా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ శాఖపైనే విమర్శలు చేయడం సరికొత్త అంశంగా మారింది.
పూర్తి వివరాలు తెలుసుకున్న పవన్..
అయితే ఉన్న ఫలంగా బోండా ఉమా ఎందుకు అలా మాట్లాడారో ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో ఓ కంపెనీ పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కిందని స్థానిక ఎమ్మెల్యేగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు ఉపక్రమించే క్రమంలో.. బోండా ఉమామహేశ్వరరావు వద్దని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ కంపెనీకి చెందిన వివరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి వెళ్లాయని.. తామేమి చేయలేమని స్థానిక అధికారులు తేల్చి చెప్పారట. ఒక కంపెనీ పై ఫిర్యాదు చేయడం.. చర్యలు తీసుకోవాలని కోరడం ఒక ఎత్తైతే.. మళ్లీ చర్యలు వద్దని సూచించడం వెనుక చాలా రకాలుగా జరిగాయన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు బోండా ఉమ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించి అడ్డంగా దొరికిపోయారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపి.. దాని వివరాలు తెలుసుకున్నారు. బోండా ఉమా పై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
వైసిపి ప్రస్తావన తెచ్చి..
మరోవైపు బోండా ఉమా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన కంపెనీల విషయంపై కూడా మాట్లాడారు. రామ్ కీ లాంటి పరిశ్రమలపై ఆరోపణలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకింత ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలపై చర్యలు తీసుకుంటే.. ఏపీలో పరిశ్రమలు మిగలవని.. అటువంటిప్పుడు చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. మధ్యలో వైసీపీ ఎంపీ కంపెనీ పేరును ప్రస్తావించి పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టారు బోండా ఉమా. కేవలం తన నియోజకవర్గంలో కంపెనీ విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరించారని.. దాని గురించి మాట్లాడబోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మధ్యలో తెచ్చారని పవన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.