Pithapuram : పిఠాపురంలో అధికారుల వ్యవహార శైలి ఏమంత బాగాలేదు. గతంలో మున్సిపల్ సమావేశంలోనే ఇద్దరు అధికారులు బాహబాహీ కి దిగారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. మరోసారి అటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు.కనీసం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని కూడా వారు గుర్తుపెట్టుకోవడం లేదు. ఎవరికి తోచినట్టు వారు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారంలో సైతం కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. ఇది దుమారానికి కారణమైంది.వాస్తవానికి పవన్ కళ్యాణ్ చాలా కఠినంగా ఉంటారు. ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో ఎటువంటి వివక్ష ఉండదు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాత్రం కొందరు అధికారుల వ్యవహార శైలితో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కూటమి పార్టీల శ్రేణుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
* స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ ఫోటో ఏర్పాటు చేయలేదు. అటు ప్రభుత్వ కార్యాలయాల తరహాలో సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదు. దీంతో అక్కడికి వచ్చిన టిడిపి, జనసేన నాయకులు దీన్ని గుర్తించారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చి పెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదంటూ జనసైనికులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
* సమావేశం బహిష్కరణ
అయితే ఇంత జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో కనిపించడం లేదని.. చాలాసార్లు ఇటువంటి అనుభవమే ఎదురైందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని.. సంబంధిత అధికారులపై వేటు తప్పదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు వర్మ. ఒకవైపు జనసైనికులు, మరోవైపు టిడిపి నేతల హెచ్చరికలతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.