Site icon OkTelugu

అక్టోబర్ 2న పవన్ కల్యాణ్ ఆ రెండు ప్రాంతాల్లో శ్రమదానం

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేస్తారని హరిప్రసాద్ తెలిపారు. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 2018లో శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోడ్డుపైనే పోరాట యాత్రలో భాగంగా కవాతు నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారని తెలిపారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే.

నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి… ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతాయి.

Exit mobile version