Nara Lokesh Russia visit: ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లోకేష్ మరోసారి భారీ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆయన రష్యా బయలుదేరి వెళ్లారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వంలో పాలనాపరమైన ముద్ర. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు. మరోవైపు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాలికి బలపం కట్టుకొని మరి విదేశాలు చుట్టేసి వస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని ఫలితాలు ప్రజల ఎదుట ఇట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా లో ఒక అంతర్జాతీయ సదస్సుకు లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో రష్యా బయలుదేరి వెళ్లారు లోకేష్. ఈసారి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అత్యున్నత సదస్సుకు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. దావోస్ పెట్టుబడుల సదస్సుతో సమానంగా ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది రష్యాలో జరుగుతున్న ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. జూన్ రెండు నుంచి ఏడు వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ సదస్సులో పాల్గొనున్నారు లోకేష్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిణామాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇచ్చే రాయితీల గురించి ఈ అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు లోకేష్.
ఆరు రోజులపాటు బిజీ బిజీ..
ఆరు రోజుల రష్యా పర్యటనలో లోకేష్ బిజీబిజీగా గడపనున్నారు. సదస్సుకు హాజరయ్యే అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో వన్ బై వన్ సమావేశాలు నిర్వహించనున్నారు లోకేష్. ఏపీ ప్రభుత్వం ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఆ రంగానికి సంబంధించి దిగ్గజాలతో మాట్లాడనున్నారు. మరోవైపు లాజిస్టిక్స్, తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను సైతం ఏపీకి తెచ్చేందుకు ఆయన ఈ రష్యా పర్యటనను వినియోగించుకోనున్నారు. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించడమే కాదు మానవ వనరుల శాఖ మంత్రిగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి లోకేష్ రష్యా పర్యటన పైనే ఉంది.
