TDP Nominated Posts: టిడిపిలో పదవుల సందడి ప్రారంభం కానుంది. టిడిపి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యంలో కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అయితే 2029 ఎన్నికలకు ఇవి మాత్రమే సరిపోవు. టిడిపి సంస్థగతంగా బలపడాలి. అదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేనతో పాటు బిజెపి ఎదగడానికి సహకారం అందించాలి. అలా చేయాలంటే టిడిపి సంస్థాగత నిర్మాణంతో పాటు నామినేటెడ్ పదవుల పంపకాలు చేయాలి. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. వాటి ఆశావహులను విడిచిపెట్టి మిగతా వారికి పదవులు సర్ది పెట్టాలి. అయితే దీనిపై విశాఖలో పెట్టుబడుల సదస్సు తరువాత క్లారిటీ రానుంది.
సాధారణంగా అధికార పార్టీ అంటే పార్టీ పదవులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మండల అధ్యక్ష పదవులు అంటే ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. పార్టీ మొత్తం అధ్యక్షుడి చేతిలో ఉండడంతో అదో గౌరవభావంగా చూస్తారు. అయితే ఇటీవల రెండు సార్లు టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా సంస్థ గత నిర్మాణం పై దృష్టి పెట్టాలని నాయకత్వాలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి అధ్యక్షుడు నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వందల మండలాలకు సంబంధించి టీడీపీ అధ్యక్షులు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ పోస్టుల విషయంలో నారా లోకేష్ పాత్ర స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీలు, దేవాలయాల ట్రస్టు పాలకవర్గాల నియామకం పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే త్వరలో వందలాది పదవులు భర్తీ చేయనున్నారు అన్నమాట.
ఇప్పటికే నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. కానీ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. విశాఖలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది. దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఈ సదస్సు పూర్తయిన వెంటనే ఒకవైపు పార్టీ సంస్థాగత నియామకాలు.. ఇంకో వైపు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే టిడిపిలో ఈ కొత్త సందడి ప్రారంభం అయినట్టే.