Nirmala Sitharaman to visit Visakha: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జీఎస్టీ విధానంతో చాలా రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అందుకే దేశం యావత్తు ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు విశాఖకు రానున్నారు. కొత్త జీఎస్టీకి సంబంధించి అవగాహన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇదే కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు సైతం హాజరవుతారు. అయితే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందుకే ఆమె జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏపీ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు నిధుల విడుదల విషయంలో సహకారం అందిస్తున్నారు. దీంతో రేపు విశాఖలో నిర్మల సీతారామన్ రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఏపీ విషయంలో శ్రద్ధ..
నిర్మలా సీతారామన్( Nirmala sitaraman) ఆది నుంచి ఏపీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమె పుట్టిన రాష్ట్రం తమిళనాడు కాగా.. మెట్టినిల్లు మాత్రం ఏపీ. ఆమె భర్త పరకాల ప్రభాకర్. అందరికీ సుపరిచితులు కూడా. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వ సలహాదారుడుగా ఉండేవారు. అయితే ఎన్ డి ఏ తో తెలుగుదేశం పార్టీ విభేదించిన తర్వాత పరకాల ప్రభాకర్ సేవలు నిలిచిపోయాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా మారింది. అమరావతి రాజధానితోపాటు పోలవరం ప్రాజెక్టు ఊపందుకుంది. ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీకి ఆర్థికపరమైన భరోసా కల్పించడంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అత్యంత చొరవ చూపుతున్నారు.
గణనీయమైన పురోగతి..
ఇటీవల జీఎస్టీ( GST) రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. అయితే తొలినాళ్లలో జీఎస్టీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. ఇదే నా సంపద సృష్టి అని ప్రశ్నించింది. అయితే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపారు సీఎం చంద్రబాబు. కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో గత ఏప్రిల్ నుంచి జీఎస్టీ వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది. ఆగస్టు వచ్చేనాటికి రికార్డు స్థాయికి చేరువ అయ్యింది. ఈ నెలకు సంబంధించి జిఎస్టి కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. అందుకే ఇప్పుడు జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి అవగాహన కార్యక్రమానికి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు అవుతున్నారు. అసలు జీఎస్టీ వసూళ్లలో పురోగతి ఎలా సాధించారు? దానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలను ఏపీ ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు నిర్మల సీతారామన్. రేపటి కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతారు. ఇదే వేదికపై ఏపీకి కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?