Homeఆంధ్రప్రదేశ్‌NDA Mlc Candidates: ఆ విషయంలో రామచంద్రయ్య లక్కీ!

NDA Mlc Candidates: ఆ విషయంలో రామచంద్రయ్య లక్కీ!

NDA Mlc Candidates: ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ఎంతటి నాయకుడైనా తెరమరుగు కావడం ఖాయం. ఓటమితో చాలామంది నేతలు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే కొంతమంది నేతలు విషయంలో ఇది మినహాయింపే. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది తక్కువే. నామినేటెడ్ పోస్టులతోనే క్రియాశీలక రాజకీయాలు చేయడం విశేషం. అంతెందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లాంటి వారు సైతం నామినేటెడ్ పదవులతోనే నెట్టుకొచ్చారు. ఇప్పుడు అదే కోవలోకి చెందుతారు ఎమ్మెల్సీగా నామినేట్ అవుతున్న రామచంద్రయ్య. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. టిడిపి తరఫున రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. దీంతో ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం దక్కించుకున్నట్టే. పార్టీలతో పని లేకుండా.. అధికార పార్టీకి దగ్గరగా ఉండే రామచంద్రయ్య పదవులు దక్కించుకోవడం కొత్త కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు నామినేటెడ్ పదవులు వరిస్తూనే ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గుడ్ల వారి పల్లెకు చెందిన రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు. టిడిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కడప నుంచి గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది అప్పుడే. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పనిచేశారు. అటు తరువాత టిడిపి నుంచి రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం.. ఓడిపోవడం పరిపాటిగా వచ్చింది.

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు రామచంద్రయ్య. టిడిపి మంచి అవకాశాలు ఇచ్చినా.. అప్పటికే ఆ పార్టీ ఒకసారి ఓడిపోవడంతో.. 2009లో గెలుస్తుందో లేదోనని ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. కానీ పిఆర్పి కి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. దీంతో 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రామచంద్రయ్య. 2012లో ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతూనే తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018లో వైసీపీలో చేరారు. 2021 మార్చి 8న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జనవరి 3న వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆయన ఎన్నిక అనివార్యమే. ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఆయన.. నామినేటెడ్ పోస్టుల ద్వారానే రాజకీయ ప్రయాణం సాగించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular