YSR Congress national media: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పైకి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఉంది. 40% ఓటు బ్యాంకు ఉంది కాబట్టి తామే అధికారంలోకి వచ్చేస్తాం అంటూ ఆ పార్టీ కలలు కంటోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. కేవలం సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత తప్ప.. పతాక స్థాయిలో మాత్రం కనిపించడం లేదు. పాలన రెండేళ్ల పాటు సజావుగా నడిచిపోయింది. ఇటువంటి తరుణంలో తమను గట్టెక్కించేది నేషనల్ మీడియా అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు నేషనల్ మీడియా సర్వేల పేరిట వైసీపీకి అనుకూల ఫలితాలు కూడా ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు విరుద్ధ తీర్పు ఇచ్చారు. అయినా సరే నేషనల్ మీడియా జపం వదలడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అనుకూల మీడియాతో..
తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మీడియా మద్దతు ఉంది. సొంత మీడియా సాక్షి అనుకూల ప్రచారం చేస్తోంది. కానీ ఆశించిన మైలేజ్ రావడం లేదు. మరోవైపు తెలుగులో ప్రముఖ న్యూస్ ఛానల్ గా ఉన్న రెండు మీడియాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఆపై సోషల్ మీడియా సైన్యం కూడా ఉంది. కానీ ఎందుకో పార్టీకి తగిన మైలేజ్ రావడం లేదు. అందుకే ఆ పార్టీ పునరాలోచనలో పడింది. నేషనల్ మీడియా సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది. గతంలో ఇండిగో సంక్షోభ సమయంలో ఓ టిడిపి నేత మాట్లాడిన మాటలను పట్టుకొని.. లోకేష్ కు వ్యతిరేకంగా సదరు మీడియా ఛానల్ ప్రచారం చేసింది. తరువాత కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా హడావిడి చేసింది.
తప్పుదోవ పట్టించేలా..
తాజాగా దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఓ నేషనల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన విషయంలో మాట్లాడే క్రమంలో చిన్నపాటి తప్పిదం దొర్లింది. దానిని వెంటనే సవరించుకున్నారు. తప్పును సరిదిద్దుకున్నారు. కానీ సదరు మీడియా ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసిన చంద్రబాబు వ్యాఖ్యలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దానిని పట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తే నేషనల్ మీడియాతో వైసిపి ఒప్పందం చేసుకుందాం అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఓ మీడియాకు ప్రకటనలతో పాటు ప్యాకేజీ రూపంలో భారీగా ముట్ట చెప్పారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో సర్వేల రూపంలో సదరు మీడియా వైసిపికి అనుకూల ఫలితాలు ఇచ్చేది. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏవైనా మొదలయ్యాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అసలు అందులో ఎంత వాస్తవం ఉందో కూడా తెలియాలి.