Nara Lokesh : ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయి. కూటమి ఏర్పడి ఏడాది అవుతోంది. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఎవరికివారుగా పార్టీల బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరుగుతోంది. 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. ఈసారి ప్రతిష్టాత్మకంగా మహానాడు ను నిర్వహిస్తోంది. మరో నాలుగు దశాబ్దాలు టిడిపి ఉనికి చాటుకునేలా ఈ మహానాడులో నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ కు పట్టాభిషిక్తుడు చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన వయోభారం, పాలనలో నిమగ్నం కావడం తదితర కారణాలతో లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు ఎదురయింది. మరోవైపు నారా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. అందుకే ఇప్పుడు అందరూ ముక్తకంఠంతో లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
* మహానాడుకు ఏర్పాట్లు..
రేపటి నుంచి మూడు రోజులపాటు కడపలో( Kadapa ) మహానాడు జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణయాలపై సర్వత్ర ఆసక్తి కనిపిస్తోంది. నారా లోకేష్ కు ప్రభుత్వంలో ప్రమోషన్ కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపించింది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా తెలుగుదేశం పార్టీలో ప్రమోషన్ ఇవ్వడం ద్వారా.. లోకేష్ ప్రాధాన్యత పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ శ్రేణులతో పాటు సీనియర్ల సైతం చంద్రబాబుపై ఇప్పటికే ఒత్తిడి తెచ్చారు. దానికి చంద్రబాబు సమ్మతించారు. ఈ మహానాడులోనే నారా లోకేష్ కు పదోన్నతి ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
Also Read : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్ ఇస్తున్నారా?
* పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా
ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు( Chandrababu) ఉన్నారు. రెండు రాష్ట్రాలకు అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులను సమన్వయం చేసుకునే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అమరావతి రాజధానితో పాటు పాలనాపరమైన అంశాలతో నిత్యం బిజీగా ఉంటారు చంద్రబాబు. ఈ తరుణంలో పార్టీని పట్టించుకోవడం అంటే ఇబ్బందికరమే. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నిమగ్నం కావడంతో.. పార్టీకి సమయం కేటాయించలేకపోయారు. అందుకే అప్పట్లో ఎన్నికల్లో అపజయం ఎదురైంది. మరోసారి అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ నుంచి వచ్చింది. అప్పుడే ప్రభుత్వంలో స్వేచ్ఛగా చంద్రబాబు పని చేసుకునే వీలు ఉంటుందని సన్నిహితులు సైతం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు మహానాడు వేదికగా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటిస్తారని తెలుస్తోంది.
* ఇబ్బందులను అధిగమించి..
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నారా లోకేష్( Lokesh ) మాదిరిగా ఏ యువనేత ఇబ్బందులు పడలేదు. చంద్రబాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ పార్టీకి అంతర్గతంగా పనిచేస్తూ వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని తెలిసి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేశారు. సమర్థమైన రాజకీయ నేత కాదన్నట్టు ముద్రవేశారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తానేమిటో నిరూపించుకున్నారు నారా లోకేష్. తన తండ్రి తో పాటు పనిచేసిన సీనియర్లను.. ప్రస్తుతం వారి వారసులతోనూ మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో లోకేష్ కు వ్యతిరేకించేవారు లేరంటే ఏ స్థాయిలో చొచ్చుకెళ్లారు అర్థమవుతోంది. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును లోకేష్ కు ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఏపీలో పార్టీ వ్యవహారాలతో పాటు జాతీయస్థాయిలో సైతం మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు లోకేష్. తద్వారా భావి నాయకుడిగా ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ఆయనకు ఈ మహానాడులో కీలక పదవి ఖాయమని అంతటా ప్రచారం నడుస్తోంది.