Nara Lokesh Popularity: నారా లోకేష్ ( Nara Lokesh) పరిణితి చెందుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు. రోజురోజుకు తన పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు. రాజకీయ పార్టీ నేతగానే కాకుండా.. పాలనాపరమైన అంశాల్లో సైతం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. పాఠశాల విద్యా శాఖలో సమూల మార్పులు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుతున్నారు. జాతీయస్థాయిలో ఏపీని నిలబెట్టే ప్రయత్నంలో ఆయన కీలక భాగస్వామిగా మారారు. అందుకే ప్రముఖ జాతీయ దినపత్రిక ‘ది వీక్’ మ్యాగజైన్ ముఖచిత్రంగా లోకేష్ ఫోటోలు ప్రచురించింది. ఉద్యోగాల సృష్టికర్తగా అభివర్ణించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీని ప్రథమ స్థానంలో నిలుపుతున్న వైనాన్ని వివరించింది. నిజంగా లోకేష్ కు ఇది గొప్ప పరిణామం. ఎందుకంటే ఎక్కడైతే అవమానించబడ్డారో.. అక్కడే అభినందనలు అందుకుంటున్నారు లోకేష్.
వ్యక్తిత్వ హననానికి గురై..
దేశంలో చాలామంది రాజకీయ వారసులు ఉన్నారు. అందులో నారా లోకేష్. అయితే ఎవరికీ లేని ఇబ్బందులు లోకేష్ కు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి రాకమునుపే ఆయన చాలామందికి శత్రువు అయ్యారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో( Indian political history) లోకేష్ ఎదుర్కొన్నంతగా.. వ్యక్తిగత హననానికి బాధితులు మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి కాదు. లోకేష్ విషయంలో పప్పు అనే ముద్రవేశారు. బాడీ షేమింగ్ పై మాట్లాడేవారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియా కాలకేయ సైన్యం ఉండేది. చంద్రబాబును వ్యతిరేకించే వారంతా లోకేష్ ను వ్యతిరేకించారు. కనీసం వ్యక్తిగా కూడా గుర్తించే పరిస్థితి ఉండేది కాదు.
ప్రతికూల పరిస్థితులు దాటుకొని..
ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విషయంలో లోకేష్ కు ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. అవమానాలను తట్టుకొని నిలబడ్డారు లోకేష్. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ లక్ష్యం వైపు సాగారు. అవమానాలను పూలబాటలుగా మార్చుకొని సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తనలో ఉన్న నాయకత్వ పటిమను ఆవిష్కరించారు. మాటల్లో ఉన్న తడబాటును అధిగమించారు. మాట్లాడడం చేతకాదు అన్నవారే.. ఏం మాట్లాడుతున్నాడు రా అంటూ వ్యాఖ్యానించే పరిస్థితి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా మారారు. సొంత పార్టీ శ్రేణుల నమ్మకాన్ని పొందారు. ఆపై పాలనాపరంగా కూడా చెరగని ముద్ర వేస్తున్నారు.
పాలనలో తనదైన ముద్ర..
రాజకీయం ఒక ఎత్తు.. పాలన ఒక ఎత్తు. రెండింటికి సమప్రాధాన్యం ఇస్తున్నారు లోకేష్. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. అందుకే రెడ్ బుక్ అంటేనే ప్రత్యర్ధులు వణికి పోతున్నారు. మరోవైపు తాను నిర్వర్తిస్తున్న పాఠశాల విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. ఆ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. అవి స్పష్టంగా ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు పొందుతున్నారు లోకేష్. యోగేంద్ర వేడుకలను దేశంలోనే అత్యుత్తమంగా ఏపీలో నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ అభిమానాన్ని అందుకున్నారు. ప్రధాని ఆహ్వానాన్ని అందుకొని కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ గెలుపు కోసం దోహదపడ్డారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఉంది. విశాఖలో ఐటీ పరిశ్రమలు, రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు వెనుక లోకేష్ కృషి అద్వితీయం. అందుకే ది వీక్ జాతీయ పత్రిక దీనినే హైలెట్ చేస్తూ లోకేష్ ముఖచిత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు జాతీయస్థాయిలో సైతం లోకేష్ చర్చకు కారణం అవుతున్నారు.